జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
Breaking News
బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు
Published on Fri, 11/14/2025 - 08:11
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బాలల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలను గుర్తుచేసుకుంటూ ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం(Childrens Day) జరుపుకుంటున్నాం. పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఎదిగి దేశానికి ఉత్తమ పౌరులుగా మారడానికి సరైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను, చట్టాలను రూపొందించి అమలు చేస్తోంది. బాలల రక్షణ, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాల వివరాలు చూద్దాం.
విద్యా హక్కు చట్టం 2009
6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి చిన్నారికి ఉచితంగా, తప్పనిసరిగా నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించాలి.
ఏ చిన్నారి నుంచి పాఠశాల ఫీజులు, ఛార్జీలు లేదా ఖర్చుల రూపంలో డబ్బు వసూలు చేయకూడదు.
ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం తరగతి సీట్లలో 25% రిజర్వేషన్ కల్పించాలి.
ఏ విద్యార్థిని కూడా 8వ తరగతి వరకు ఫెయిల్ చేయకూడదు లేదా పాఠశాల నుంచి తొలగించకూడదు (తరువాత కొన్ని రాష్ట్రాలు ఈ నిబంధనను సడలించాయి).
పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి వంటి ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
మిషన్ వాత్సల్య
భారతదేశంలోని ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. ఇది బాలల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఒక సమగ్ర పథకం.
సంరక్షణ అవసరమైన పిల్లల కోసం శిశు గృహాలు, ప్రత్యేక దత్తత సంస్థలు, ఓపెన్ షెల్టర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయాలి.
బాలల దత్తత, పోషణ సంరక్షణ, స్పాన్సర్‌షిప్ (ఆర్థిక సహాయం) వంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఈ విధానం ద్వారా పిల్లలను సంస్థలకు కాకుండా కుటుంబ వాతావరణంలో పెంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.
జువైనల్ జస్టిస్ బోర్డులు (JJBs), బాలల సంరక్షణ కమిటీలు (CWCs), బాలల భద్రతా యూనిట్ల ఏర్పాటుకు మద్దతు ఇస్తారు.
కష్టాల్లో ఉన్న పిల్లల కోసం 24 గంటలు పనిచేసే చైల్డ్‌లైన్ (1098) సేవలను బలోపేతం చేయాలి.
బేటీ బచావో, బేటీ పడావో
బాలికల పట్ల సామాజిక దృక్పథంలో మార్పు తీసుకురావడం, లింగ వివక్షను తొలగించడం, ఆడపిల్లల సంఖ్య తగ్గుదలను నివారించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం.
బాలికల జనన నిష్పత్తి తగ్గుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమాజంలో బాలికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి.
పాఠశాలల్లో బాలికల నమోదును పెంచడం, వారి డ్రాపౌట్ రేటును తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ సేవలు అందేలా చూడాలి.
బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
ఈ పథకం స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది.
ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణం(మధ్యాహ్న భోజన పథకం)
ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి.
ఆకలితో పాఠశాల మానేసే సమస్యను తగ్గించి పిల్లలు తరగతి గదిలో చురుగ్గా పాల్గొనేలా చేయాలి.
కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా పిల్లలందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయడం ద్వారా సామాజిక సమానత్వాన్ని పెంచాలి.
ఈ పథకంలో భాగంగా అదనంగా చిరుధాన్యాలు కూడా సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సుకన్య సమృద్ధి యోజన
ఆర్థికంగా బాలికలకు భద్రత కల్పించడం, వారి ఉన్నత విద్య, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం తల్లిదండ్రులు/ సంరక్షకులు పొదుపు చేసేలా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.
10 సంవత్సరాలలోపు వయసు ఉన్న బాలిక పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు (ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికలకు).
ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయవచ్చు.
ఇది భారత ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి సాధారణ పొదుపు పథకాల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తుంది (ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం ఈ రేటును సవరిస్తుంది).
ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై వచ్చే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.
బాలిక 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం కొంత మొత్తాన్ని లేదా 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి కోసం పూర్తి మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పరుగెడుతున్న కొనుగోళ్లు.. జాగ్రత్త!
Tags : 1