మద్యం అక్రమ కేసులో మోహిత్ రెడ్డికి భారీ ఊరట
Breaking News
భారత వృద్ధి అంచనాలు అంతకు మించి..
Published on Tue, 01/20/2026 - 08:22
భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.3 శాతం వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో వేసిన అంచనా కంటే ఇది 0.7 శాతం అధికం. భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనాలకు మించి ఉండడమే సవరణకు దారితీసినట్టు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) సంబంధించి వృద్ధి అంచనాను సైతం 6.2 శాతం నుంచి 6.4 శాతానికి పెంచింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే బలంగా నమోదు కావడంతోపాటు, డిసెంబర్ త్రైమాసికంలోనూ కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు ఐఎంఎఫ్ తన తాజా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌లో తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం అంచనా ప్రకారం 2025–26 సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం వృద్ది రేటు నమోదు కావడం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం తన ముందస్తు అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది.
ద్రవ్యోల్బణం పెరుగుతుంది..
ద్రవ్యోల్బణం 2025లో కనిష్ట స్థాయిలకు తగ్గగా.. ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం స్థాయికి చేరుకోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మరీ ప్రతికూల పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి ఎగువ, దిగువ వైపు 2 శాతం మించకుండా (2–6 శాతం) చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. ఇక 2026లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంటుందని, 2027లో ఇది 3.2 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 అక్టోబర్ అంచనాలతో పోల్చి చూస్తే వీటిల్లో పెద్ద మార్పు లేదు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు 2026, 2027లో 4 శాతం ఎగువన ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా వృద్ధి రేటును 0.2 శాతం పెంచి 5 శాతం చేసింది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం 2025లో ఉన్న 4.1 శాతం నుంచి 2026లో 3.8 శాతానికి పరిమితం అవుతుందని, 2027లో 3.4 శాతానికి దిగొస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం
Tags : 1