DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
భారత కంపెనీలపై కెన్యా ‘సఫారీ’!
Published on Sat, 09/05/2026 - 09:06
కెన్యాలోని కజియాడో కౌంటీలోని మగాడి సరస్సు వద్ద టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్(టీసీఎంఎల్) సోడా యాష్ గనులను నిర్వహిస్తోంది. శతాబ్దంపైగా చరిత్ర గల ఈ గనులను 2005లో బ్రిటన్‌కు చెందిన బర్నర్ మాండ్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా టాటా కెమికల్స్ కెన్యాలోకి అడుగుపెట్టింది. 100 ఏళ్ల మైనింగ్ హక్కులను దక్కించుకుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే సోడా యాష్‌ను గ్లాస్, డిటర్జెంట్లతో సహా రకరకాల పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ఈ ఖనిజం విదేశాలకూ భారీగా ఎగుమతవుతోంది. అయితే, ఈ ఏడాది జూలై 28న మైనింగ్ క్యాబినెట్ సెక్రటరీ హాసన్ జోహో టీసీఎంఎల్ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేయడంతో గొడవ మొదలైంది. మైనింగ్ లైసెన్సులతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించిందనేది గనుల శాఖ ఆరోపణ.
అంతేకాదు, రాయల్టీలు, ఖనిజ శుద్ధి, ఎగుమతుల రిపోర్టింగ్, కమ్యూనిటీ అభివృద్ధికి సంబంధించి కూడా పలు ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా టాటా కెమికల్స్ ఇక్కడ గనుల నుంచి వెలికితీస్తున్న ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసేందుకు తగినన్ని ఫ్యాక్టరీలను పెట్టకుండా, ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, మైనింగ్ శాఖ సస్పెన్షన్ ఆదేశాలపై కెన్యా హైకోర్టులో సవాలు చేసినా టాటాలకు ఊరటదక్కలేదు.
రూటో అల్టిమేటం..
కెన్యా అధ్యక్షుడు విలియం రూటో టాటా కెమికల్స్ తమ దేశాన్ని విడిచిపోవాలంటూ అల్టిమేటం జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది. టాటా దశాబ్దాలుగా తమ దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ.. తగినన్ని ఫ్యాక్టరీలను నెలకొల్పలేదని, స్థానికంగా ఎలాంటి పారిశ్రామిక ప్రగతీ లేదని రూటో విరుచుకుపడ్డారు. ప్రజలకు టాటా కెమికల్స్ వల్ల పైసా ప్రయోజనం లేదని, అందుకే ఈ ప్రాంతంలో గ్లాస్, కెమికల్ తయారీ ఫ్యాకర్టీల కోసం ప్రభుత్వం రెండు కంపెనీలను నెలకొల్పుతుందన్నారు. టాటాల వ్యాపారాన్ని ఆ కంపెనీలు టేకోవర్ చేస్తాయని ప్రకటించారు.
గతంలో కూడా ఇక్కడ టాటాలతో గొడవ నడిచింది. భూమి ధరలు, రాయల్టీలకు సంబంధించి తమకు 17.4 బిలియన్ కెన్యన్ షిల్లింగ్లను చెల్లించాలంటూ కిజియాడో కౌంటీ కోర్టుకెక్కింది. అయితే, దీనిపై టాటాలకు అనుకూలంగా తీర్చురావడంతో పరిస్థికి కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే టాటాలను దేశం నుంచి వెళ్లగొట్టే చర్యలకు తెరతీయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలు, కోర్టులే టాటా కెమికల్స్ కెన్యా వ్యాపార భవిష్యత్తును తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది.
సమస్యలను పరిష్కరించుకుంటాం టాటా కెమికల్స్ వెల్లడి
మగాడి గనుల సస్పెన్షన్ ఆదేశాల నేపథ్యంలో కెన్యా గనుల శాఖ కోరిన సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులు అన్నీ ఇప్పటికే సమర్పించామని టాటా కెమికల్స్ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం న్యాయపరంగా, నియంత్రణపరంగా కెన్యా ప్రభుత్వంతో కలిసి తగిన చర్యలు చేపట్టడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉద్యోగులు, మగాదీ ప్రజల శ్రేయస్సుతో పాటు కెన్యా ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది.
మన కంపెనీలపై కన్నెర్ర...
టాటాకు ముందు కెన్యాలో వివిధ రకాల ప్రతికూలతలతో దుకాణం సర్దేసిన భారతీయ కంపెనీలు చాలానే ఉన్నాయి.
అదానీ: నైరోబీ జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జేకేఐఏ) ఆధునీకరణ ప్రాజెక్టును (1.85 బిలియన్ డాలర్లు) 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 2024లో దక్కించుకుంది. వ్యూహాత్మక జాతీయ ఆస్తులను విదేశీ కంపెనీలకు కట్టబెడితే ఉద్యోగాలు పోతాయంటూ కెన్యాలోని విమానయాన యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోపక్క, అదానీ ఎనర్జీ, కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీతో 30 ఏళ్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఈ విద్యుత్ ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విలువ 736 మిలియన్ డాలర్లు. అమెరికాలో గౌతమ్ అదానీపై లంచాల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రూటో ఈ రెండు అదానీ ప్రాజెక్టులను రద్దు చేశారు. అయితే, ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రద్దు వెనుక చైనా హస్తంపై అనుమానాలున్నాయి. ఎందుకంటే 1.2 బిలియన్ డాలర్లతో చైనా రోడ్ అండ్ బ్రిడ్స్ కార్పొరేషన్ జేకేఐఏ విస్తరణకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
ఎస్సార్: 2008లో ఎస్సార్ తన యూమొబైల్ టెలికం వ్యాపారాన్ని కెన్యాలో ప్రారంభించింది. 40 బిలియన్ కెన్యన్ షిల్లింగ్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే, నష్టాల కారణంగా 2014లో దీన్ని ఎయిర్టెల్, సఫరీకామ్లకు విక్రయించింది. ఇక కెన్యా పెట్రోలియం రిఫైనరీస్‌లో 50 శాతం వాటాను ఎస్సార్ ఎనర్జీ 2016లో కెన్యా ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లకు వదిలేసి వైదొలగింది. కెన్యా ప్రభుత్వ ప్రతికూల పాలసీలే దీనికి కారణమనేది ఎస్సార్ ఆరోపణ.
కరుటూరి గ్లోబల్: బెంగళూరుకు చెందిన ఈ ఫ్లవర్ బిజినెస్ కంపెనీ దాదాపు 383 మిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించలేక పోవడం, పన్నుల సంబంధ వివాదాదలతో దుకాణం సర్దేసింది.
మహీంద్రా: కామ్సన్ మోటార్స్ పేరుతో కెన్యాలో మహీంద్రా వాహన వ్యాపారాన్ని వివాదాస్పద సరఫరా ఒప్పందం కారణంగా మూసేసింది. అయితే, 2012లో స్థానిక పంపిణీ ఒప్పందం ద్వారా మహీంద్రా మళ్లీ కెన్యాలో అడుగుపెట్టింది.
ఎయిర్టెల్: కెన్యాలో 2015లో ముగిసిన యూమొబైల్ లైసెన్స్ విషయంలో భారీ ఫీజుల చెల్లింపు డిమాండ్‌పై అక్కడి టెలికం నియంత్రణ సంస్థలతో ఎయిర్టెల్ తీవ్ర పోరాటమే చేయాల్సి వచ్చింది. కెన్యాలో రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలుస్తున్న ఎయిర్టెల్ గత నెలలోనే కోర్టు వెలుపల సెటిల్మెంట్ ద్వారా మళ్లీ 25 ఏళ్ల కొత్త లైసెన్స్ దక్కించుకుంది.
అయితే, ప్రభుత్వంతో వివాదాలు నెలకొంటున్నా... కెన్యాలో ఇప్పటికీ 200 భారతీయ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండటం విశేషం. ఇందులో గోద్రెజ్, థెర్మాక్స్, యూపీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఐటీ, ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా కంపెనీలు నేరుగా ప్లాంట్ల ఏర్పాటు కంటే వాణిజ్యపరమైన లావాదేవీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. కాగా, అదానీతో డీల్ రద్దు తర్వాత 311 మిలియన్ డాలర్ల విలువైన ట్రాన్స్మిషన్ కాంట్రాక్టు కోసం ప్రభుత్వ రంగ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌తో కెన్యా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా?
Tags : 1