ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్
Published on Tue, 03/24/2026 - 08:35
సరిగ్గా పాతికేళ్ల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం తర్వాత.. వాషింగ్టన్-న్యూఢిల్లీ-టెల్ అవీవ్ (అమెరికా-భారత్-ఇజ్రాయెల్) మధ్య సెక్యూరిటీ ట్రైయాంగిల్ ఏర్పడాలని అంతర్జాతీయ నిపుణులు సూచించారు. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లెబనాన్ మీదుగా గాజా వరకు విస్తరించి ఉన్న ఉగ్రవాద కారిడార్‌ను అడ్డుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ రెండు వైపులా రక్షణ కవచాలుగా నిలుస్తాయన్నది ఆనాటి ఆలోచన. కానీ, 2026 నాటికి అంతర్జాతీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటి సెక్యూరిటీ ట్రైయాంగిల్కు సపోర్ట్‌గా ఉన్న అమెరికా ఇప్పుడు తన పట్టు కోల్పోతుంటే భారత్ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన శక్తిగా ఆవిర్భవించింది.
అమెరికా వ్యూహాత్మక వైఫల్యం - ఇరాన్ సంక్షోభం
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒక అస్థిరమైన సూపర్ పవర్‌గా కనిపిస్తోంది. సరైన నిష్క్రమణ వ్యూహం లేకుండా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడం, ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగలదని అంచనా వేయకపోవడం వాషింగ్టన్ చేసిన అతిపెద్ద పొరపాట్లు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటిపోయింది. అటు రష్యాపై ఆంక్షల విషయంలోనూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు మిత్రదేశాలకే మింగుడుపడటం లేదు.
భారత్-ఇజ్రాయెల్ బంధం
భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు నిన్న మొన్నటివి కావు. 1962 చైనా యుద్ధం సమయంలోనే ఇజ్రాయెల్ రహస్యంగా భారత్‌కు సైనిక సాయం అందించింది. ఇందిరా గాంధీ హయాంలో 1968 నుంచే ‘రా’, ‘మొసాద్’(ఇజ్రాయెల్) మధ్య నిఘా సంబంధాలు ఉన్నాయి. నేడు ఇజ్రాయెల్ సాంకేతికత భారత రక్షణ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. నెతన్యాహు అన్నట్లు ఇది స్వర్గంలో కుదిరిన బంధం అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి
భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠం. ఇరాన్ తన జలాల్లో పాశ్చాత్య దేశాల నౌకలను అడ్డుకుంటున్నా భారత నౌకలకు మాత్రం ‘ప్రివిలేజ్డ్ న్యూట్రల్’(విశిష్ట తటస్థ దేశం) హోదా ఇచ్చి అనుమతిస్తోంది. దీని వెనుక దశాబ్దాల నాటి దౌత్య నీతి ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును కాపాడుకుంటూ వచ్చింది. ముంబై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు ఇరాన్ మీదుగా సాగే అంతర్జాతీయ రవాణా కారిడార్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
మెరుగైన సంబంధాలు
ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ, ఎస్.జైశంకర్ నాయకత్వంలో భారత్ ‘యాక్టివ్ మల్టీ-వెక్టర్ ఎంగేజ్మెంట్’ను అనుసరిస్తోంది. అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలతో ఏకకాలంలో మెరుగైన సంబంధాలను కొనసాగించగల ఏకైక దేశంగా భారత్ నిలిచింది. నేటి భౌగోళిక రాజకీయాల్లో అమెరికా కేవలం పెట్టుబడి, సాంకేతికతకు మాత్రమే పరిమితమవుతోంది. ఇజ్రాయెల్‌కు లేని ఇరాన్ ఛానల్, రష్యా ఛానల్ భారత్ వద్ద ఉన్నాయి. 50 ఏళ్లుగా నిశ్శబ్దంగా సిద్ధమైన భారత్ ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య ఒక శాంతి వారధిగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
Tags : 1