సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
Breaking News
టెక్ దేశానికి వీసా ఫీజులు పెరుగుతున్నాయ్..!
Published on Mon, 04/13/2026 - 12:38
జపాన్‌లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్‌కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.
ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.
గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వం
ఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు.
అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.
పెంపునకు కారణం ఏంటి?
మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
Tags : 1