ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది
Breaking News
వ్యూహాత్మక ఖనిజాల వేట
Published on Fri, 03/27/2026 - 11:43
సాంకేతిక, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశీయంగా ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల’ (అరుదైన అయస్కాంత ఖనిజాలు) ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 5,000 టన్నుల అరుదైన అయస్కాంత ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.
విశాఖలో ప్లాంట్ ప్రారంభం
అణుశక్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో ‘సమారియం-కోబాల్ట్’ అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 500 టన్నులు. తదుపరి దశలో దీన్ని 2,000 టన్నులకు, ఆపై 2030 నాటికి 5,000 టన్నులకు పెంచనున్నారు. నియోడైమియం-ఐరన్-బోరాన్ వంటి అధునాతన అయస్కాంతాల తయారీపై పైలట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టింది.
పెరుగుతున్న డిమాండ్.. ప్రైవేటు భాగస్వామ్యం
ప్రస్తుతం దేశంలో ఈ అయస్కాంతాల అవసరం ఏడాదికి 4,000 టన్నులుగా ఉండగా 2030 నాటికి అది 8,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. తద్వారా కీలక ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపింది. అయితే, యురేనియం వంటి వ్యూహాత్మక వనరులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది.
లిథియం అన్వేషణపై దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన లిథియం కోసం రాజస్థాన్‌లోని దేగానా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దేగానాలో ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ శుద్ధి ప్రక్రియను బలోపేతం చేయనున్నారు.
వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?
ఈ అరుదైన ఖనిజాలు కేవలం ఎలక్ట్రానిక్స్ కోసమే కాకుండా.. రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ల తయారీలో, అంతరిక్ష రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో, గ్రీన్ ఎనర్జీ విభాగంలో విండ్ టర్బైన్లు, ఈవీ మోటార్లలో ఇవి అత్యంత కీలకం. రాజస్థాన్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శిలల రూపంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం కొంత సంక్లిష్టమైనప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సవాలును అధిగమిస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
Tags : 1