Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్
Breaking News
ఎకానమీకి జీసీసీల దన్ను
Published on Tue, 07/15/2025 - 01:59
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. 2030 నాటికి వీటితో ఎకానమీకి 200 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరనుంది. అలాగే మరిన్ని ఉద్యోగాల కల్పనకు కూడా ఇవి తోడ్పడనున్నాయి. సీఐఐ–జీసీసీ బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. 2024లో సగటున వారానికొక జీసీసీ చొప్పున ఏర్పాటైందని వివరించారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 50 శాతం సంస్థలు భారత్‌లో తమ సెంటర్లను నెలకొల్పాయని పేర్కొన్నారు.
గత అయిదేళ్లుగా పరిశ్రమ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందిందన్నారు. వీటిలో దేశీయంగా సుమారు 21.6 లక్షల మంది ప్రొఫెషనల్స్ పని చేస్తుండగా 2030 నాటికి ఈ సంఖ్య 28 లక్షలకు చేరనుందని మంత్రి చెప్పారు. భారత జీసీసీ రంగం స్థూలంగా 68 బిలియన్ డాలర్ల విలువను (జీవీఏ) ఎకానమీకి జోడించిందని, 2030 నాటికి ఇది 150–200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. వ్యయాలపరంగా అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియాతో పోలిస్తే మన దగ్గర నిపుణుల సేవలు దాదాపు 30–50 శాతం తక్కువకే లభిస్తున్నాయని పేర్కొన్నారు.
పాలసీలను క్రమబద్దీకరించాలి..
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) భారత్ హబ్‌గా ఎదగాలంటే జాతీయ స్థాయిలో వాటికి సంబంధించిన పాలసీలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. జీసీసీలు అత్యధికంగా ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు.
చాలా రాష్ట్రాల్లో నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని, పెద్ద ఎత్తున జీసీసీలు ఏర్పాటైతే తక్కువ వ్యయాలతోనే సేవలందించడంలో అంతర్జాతీయంగా పోటీపడే వీలుంటుందని వివరించారు. భారత్‌లో సుమారు 1,800 జీసీసీలు ఉన్నాయి. బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సీ) తమ వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం వీటిని ఏర్పాటు చేశాయి. స్టార్టప్ వ్యవస్థ కూడా వీటి విస్తరణకు దోహదపడింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసే విధానాన్ని రూపొందించడంపై కేంత్రం దృష్టి పెడుతోంది.
Tags : 1