రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు
Published on Mon, 07/06/2026 - 19:33
మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై రంగురంగుల లేబుళ్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోతున్న వినియోగదారుల రక్షణే ధ్యేయంగా దేశీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రొడక్ట్ లేబుళ్లపై తప్పుడు వాదనలు చేసినందుకు గాను దేశంలోని మూడు ప్రముఖ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 (ఎఫ్‌ఎస్‌ఎస్ యాక్ట్) ప్రకారం వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వడానికి ఏడు రోజుల గడువు విధించింది. ఈ జాబితాలో ప్రముఖ డైరీ బ్రాండ్ హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఉండటం గమనార్హం.
‘ఫ్రెష్ పన్నీర్’, ‘హెల్తీ’ పదాలపై హెరిటేజ్‌కు నోటీసులు
ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విక్రయిస్తున్న ‘హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్’ ఉత్పత్తిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘ఫ్రెష్’ అనే పదంపై అభ్యంతరం: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలలోని షెడ్యూల్ V ప్రకారం... ఒక ఉత్పత్తికి ‘ఫ్రెష్’ (తాజా) అనే పదాన్ని వాడటానికి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. హెరిటేజ్ పన్నీర్ ఆ షరతులను పూర్తిగా సంతృప్తి పరచడం లేదని, తద్వారా ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
‘హెల్తీ హ్యాపీనెస్’ ట్రేడ్‌మార్క్ వివాదం: బ్రాండ్ పేరు లేదా ట్రేడ్‌మార్క్‌లో ‘హెల్తీ’ (ఆరోగ్యకరమైనది) అనే పదాన్ని ఉపయోగించడంపై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. ఇది ‘ఎఫ్‌ఎస్‌ఎస్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్, 2018’లోని రూల్ 8 (3) కు విరుద్ధం. ఈ పదం వల్ల ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే తప్పుడు అభిప్రాయం వినియోగదారుల్లో కలుగుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.
‘100% ఆర్గానిక్’ అంటూ డియా ఫుడ్స్ మాయాజాలం!
హాజెల్ నట్ చాక్లెట్‌ను మార్కెట్ చేస్తున్న డియా ఫుడ్స్ సంస్థపై కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు చేపట్టింది. ఈ ప్రొడక్ట్‌పై కంపెనీ చేసిన ‘ఆల్ నేచురల్’, ‘100% ఆర్గానిక్’, ‘శాకాహారి (వేగన్)’ వాదనలు చట్ట విరుద్ధమని తేలింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లో ఈ ఉత్పత్తికి సంబంధించి సేంద్రీయ (ఆర్గానిక్) ఆహారం లేదా శాకాహారి (వేగన్) గుర్తింపు కోసం ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అయినప్పటికీ ప్యాకెట్‌పై ‘100% ఆర్గానిక్’ అని ముద్రించడం తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది.
అంతేకాకుండా, మే 28, 2026న FSSAI జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. ఆహార చట్టాల కింద ‘100%’ అనే పదానికి ఎలాంటి అధికారిక నిర్వచనం లేదా ప్రస్తావన లేదు. కాబట్టి ‘100% ఆర్గానిక్’ అనే వాదన ముమ్మాటికీ వినియోగదారులను మోసం చేయడమేనని రెగ్యులేటర్ తేల్చి చెప్పింది.
సిప్జర్ న్యూట్రాస్యూటికల్స్..
సిప్జర్ (Sipzer) సంస్థ విక్రయించే జ్యూస్ క్యాప్సూల్స్ లేబులింగ్, ప్రమోషన్లలో అక్రమాలు జరిగినట్లు FSSAI గుర్తించింది. ఈ కంపెనీ లేబుల్‌పై రాసిన ప్రతి అక్షరాన్నీ రెగ్యులేటర్ తూర్పారబట్టింది.
FSSAI అప్రూవ్డ్?: కంపెనీ తన ప్యాకింగ్‌పై ‘FSSAI ఆమోదించబడింది’ (FSSAI Approved) అని ముద్రించుకుంది. నిజానికి FSSAI ఏ బ్రాండ్‌నూ ప్రత్యేకంగా ఆమోదించదు. కేవలం ప్రమాణాల లైసెన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ లోగోను చూసి జనం ఇది ప్రభుత్వ సర్టిఫైడ్ ప్రొడక్ట్ అని నమ్మే ప్రమాదం ఉంది.
శాస్త్రీయ ఆధారాలు లేవు: ‘మీ రోగనిరోధక శక్తిని పెంచండి’, ‘మీ శరీర విషాలను తొలగించండి’ వంటి భారీ డైలాగులకు కంపెనీ వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ప్యాకెట్ పైన టమోటా, దోసకాయ, బ్రోకలీ, క్యాబేజీ, కొత్తిమీర చిత్రాలను ముద్రించారు. కానీ, లోపల ఉన్న పదార్థాల జాబితాలో వీటి ప్రస్తావనే లేదు.
లేబుల్‌పై విటమిన్-ఇ, విటమిన్-సి ఉన్నట్లు ప్రకటించినా విటమిన్-ఇ ఎంత ఉందో రాయలేదు. విటమిన్-సి కేవలం 0.1% మాత్రమే ఉంది. అలాగే, రోజువారీ అవసరాలకు ఇది ఎంత మేర తోడ్పడుతుందో తెలిపే ‘ఆర్‌డీఏ’ (Recommended Dietary Allowance) శాతాన్ని కూడా పేర్కొనలేదు.
అధికారిక ఆర్గానిక్ సర్టిఫికేషన్ గుర్తులు కానీ లేకుండానే ‘సేంద్రీయ కూరగాయలతో తయారు చేయబడింది’ అని రాయడం నిబంధనల ఉల్లంఘనే.
ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!
Tags : 1