ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
Breaking News
6 రోజుల్లో రూ.53,739 కోట్లు!
Published on Wed, 11/11/2026 - 05:23
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా దేశీ స్టాక్స్‌లో ఎడాపెడా అమ్మకాలతో బేర్ బాజా మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) యూటర్న్ తీసుకున్నారు. నవంబర్ తొలి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (2–9 తేదీల మధ్య) ఏకంగా రూ. 53,739 కోట్లు కుమ్మరించారు. సెపె్టంబర్‌లో రూ. 34,843 కోట్లు, అక్టోబర్‌లో రూ.35,861 కోట్ల చొప్పున నికర అమ్మకాలతో మార్కెట్లను షేక్ చేసిన ఎఫ్‌పీఐలు మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారడంతో బుల్స్‌లో ఫుల్ జోష్ నింపింది.
కనిష్టాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 10 శాతం ర్యాలీతో దుమ్మురేపాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ షేర్లలో అమ్మకాల సునామీ, దేశీయంగా పటిష్టమైన కార్పొరేట్ ఫలితాలు, ఇటీవలి పతనం తర్వాత లార్జ్‌క్యాప్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడంతో ఎఫ్‌పీఐలు తిరిగి మన మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. మరోపక్క, ప్రభుత్వం ఎఫ్‌పీఐలకు ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నును తొలగించనుందన్న అంచనాలు కూడా తాజా కొనుగోళ్లకు ట్రిగ్గర్‌గా నిలిస్తోందనేది మార్కెట్ విశ్లేషకుల మాట.
ఫైనాన్షియల్స్, ఐటీలో...
‘అమెరికాలో డేటా సెంటర్లపై భారీ వ్యయాలకు సంబంధించి నెలకొన్న భయాలు ఏఐ కంపెనీల షేర్ల పతనానికి దారితీసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్, సెనేట్‌లో పూర్తి మెజారిటీ దక్కించుకున్న డెమోక్రాట్లు అసంబద్ధమైన డేటా సెంటర్ వ్యయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏఐకి ముకుతాడు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత్‌లోని ఏఐ యేతర ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, ఐటీ, ఆటోమొబైల్, టెలికం షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిపారు.
Tags : 1