కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
Published on Tue, 03/31/2026 - 14:29
రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎరువుల విక్రయశాలల వద్ద రైతుల సందడి పెరిగింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఈసారి మార్చిలోనే రికార్డు స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఎరువుల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో అన్నదాతలు భారీగా నిల్వలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు అంచనాలను మించిపోవడం గమనార్హం.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
| ఎరువు | మార్చి అంచనా డిమాండ్ (లక్షల టన్నుల్లో) | మార్చి 23 నాటికే జరిగిన విక్రయాలు |
|---|---|---|
| యూరియా | 14.96 | 20.21 |
| డీఏపీ | 2.43 | 4.78 |
| కాంప్లెక్స్ ఎరువులు | 7.05 | 7.22 |
| ఎంఓపీ | 1.80 | 1.58 |
గత ఏడాది (2025) మార్చి నెల మొత్తం మీద జరిగిన యూరియా విక్రయాలు 16.2 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది మార్చి 23 నాటికే అది 20 లక్షల టన్నులు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మార్చి 14 నుంచి 23 మధ్య పది రోజుల్లోనే సుమారు 13 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది.
తెలుగు రాష్ట్రాల్లో నిల్వ ధోరణి
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరి సాగు కోసం రైతులు ముందస్తుగానే ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు. ఏటా సీజన్ సమయంలో ఎదురవుతున్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ముఖ్యంగా తక్కువ ధర ఉండే ఎరువులు, గతంలో కొరత ఏర్పడిన వాటిపై రైతులు మక్కువ చూపుతున్నారు. జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతోనే ఈ ముందస్తు నిల్వలు జరుగుతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఏ.కె.సింగ్ అన్నారు.
ప్రభుత్వ చర్యలు - క్షేత్రస్థాయి పరిశీలన
ఈ ఆకస్మిక విక్రయాల పెరుగుదలపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, పెరిగిన విక్రయాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.
స్టాక్ వెరిఫికేషన్
క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలపై భౌతిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజంగా రైతులే కొంటున్నారా? లేక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడానికి రికార్డుల్లో విక్రయాలు చూపి నిల్వ చేస్తున్నారా? అనే కోణంలో విచారణ జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు మొక్కజొన్న, చెరకు పంటల కోసం విక్రయాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు
Tags : 1