పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
Breaking News
దుబాయ్ బ్యాంకు చేతికి ఆర్‌బీఎల్ బ్యాంక్
Published on Fri, 01/23/2026 - 08:49
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్(ఈఎన్‌బీడీ)కు అనుమతి లభించింది. ఎమిరేట్స్ ఎన్‌బీడీ చేసిన ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 3 బిలియన్ డాలర్లు(రూ. 26,850 కోట్లు) వెచ్చించి మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఈఎన్‌బీడీ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇందుకు ఈఎన్‌బీడీతోపాటు ఆర్‌బీఎల్ బ్యాంక్ బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు 2025 అక్టోబర్‌లో ఈఎన్‌బీడీ వెల్లడించింది. నియంత్రిత సంస్థల అనుమతుల తదుపరి ఫ్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఆర్‌బీఎల్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఈఎన్‌బీడీ అక్టోబర్‌లో వెల్లడించింది. తద్వారా ప్రతిపాదిత పెట్టుబడులను వెచ్చించనుంది.
అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం ఆర్‌బీఎల్ బ్యాంక్ సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించవలసి ఉంది. వెరసి పబ్లిక్ నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ఇవ్వవలసి ఉంది.
కాగా.. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్‌లో నిర్దారిత వాటా కొనుగోలుకి అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్‌కు కూడా సీసీఐ అనుమతి మంజూరు చేసింది. దీంతో అపోలో హెల్త్‌లో అపోలో హాస్పిటల్స్ 30.58 శాతం వాటా సొంతం చేసుకోనుంది. తద్వారా అపోలో హెల్త్‌లో వాటాను ప్రస్తుత 68.84 శాతం నుంచి 99.42 శాతానికి అపోలో హాస్పిటల్స్ పెంచుకోనుంది. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ ప్రైమరీ, సెకండరీ హెల్త్‌కేర్ సర్వీసులకు వీలు కల్పించడంతోపాటు, డయాగ్నోస్టిక్, టెలిమెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తున్న విషయం విదితమే.
Tags : 1