ఈ యుద్ధం ఎక్కడ ఎందుకు మొదలైంది..
Breaking News
హరిత భవనాలకు డిమాండ్.. హైదరాబాద్‌లో 720కి పైగా రిజిస్టర్!
Published on Sat, 02/28/2026 - 17:04
నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారు హరిత భవనాలపై ఆసక్తి చూపుతున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యకరంగా ఉంచే ఈ భవనాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కాస్త ఖరీదైనా వీటివైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
స్వచ్ఛమైన గాలి, వెలుతురుతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌర శక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు.
నిత్యావసరాలకు వినియోగించే నీటిని బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది.
అదనపు వ్యయం రెండేళ్లలో వాపస్..
ఈ భవనాల్లో నిత్యం నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీ రియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.
Tags : 1