Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు
Breaking News
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
Published on Mon, 12/29/2025 - 14:34
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం
తమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
కారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.
ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.
న్యాయ నిపుణుల విశ్లేషణ
ఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే..
Tags : 1