ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
కాగ్నిజెంట్ కొత్త ప్రాజెక్ట్.. టెకీల గుండెల్లో గుబులు!
Published on Thu, 04/30/2026 - 17:34
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ లీప్’ (Project Leap) ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుండటంతో, భారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
రూ. 2000 కోట్లకు పైగా ఖర్చు..
ప్రాజెక్ట్ లీప్‌ను ఒక పరివర్తన కార్యక్రమంగా కాగ్నిజెంట్ అభివర్ణిస్తోంది. దీనికోసం 2026 నాటికి 230 నుంచి 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 - రూ.2,600 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సింహభాగం అంటే 200 నుంచి 270 మిలియన్ డాలర్లు కేవలం ఉద్యోగుల విడదీత (Severance pay), సిబ్బందికి సంబంధించిన ఇతర ఖర్చులకే కేటాయించడం గమనార్హం.
ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే.. తొలగింపుల ప్రభావం కొన్ని వేల మందిపై ఉండబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేదు.
‘పిరమిడ్’ రివర్స్.. జూనియర్లకే ప్రాధాన్యం!
కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఈ మార్పులపై స్పందిస్తూ.. సంస్థను ‘విస్తృత, చిన్న’ (Broad and Small) పిరమిడ్ ఆకృతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే నిర్వహణ విభాగంలో (Management layers) ఉన్న సీనియర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం.. ఎక్కువ మంది ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా సంస్థ అట్టడుగు భాగాన్ని బలోపేతం చేయడం.. క్లిష్టమైన ఏఐ నైపుణ్యాలను యువ శ్రామిక శక్తి ద్వారా వేగంగా నిర్మించడం చేస్తారు.
భారీ పొదుపు.. ఏఐపై పెట్టుబడి
ఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 నాటికి 200 నుంచి 300 మిలియన్ డాలర్ల వ్యయాన్ని ఆదా చేయాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి ఏఐ సామర్థ్యాల పెంపుదల, ఉద్యోగుల రీస్కిల్లింగ్, మార్జిన్లను పెంచడం కోసం వినియోగించనున్నారు.
కాగ్నిజెంట్‌కు ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్తేమీ కాదు. 2023లో సుమారు 300 మిలియన్ డాలర్ల ఖర్చుతో అమలు చేసిన 'నెక్స్ట్ జెన్' ప్రోగ్రామ్ 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. అంతకు ముందు 2020లో 'ఫిట్ ఫర్ గ్రోత్' దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపింది.
ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300. ఒకవైపు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయని చెప్తూనే, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తుండటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags : 1