ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
Published on Tue, 05/05/2026 - 16:04
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందన
నియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.
అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు
2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.
క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.
తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.
భారతదేశంతో అనుసంధానం
భారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.
అలబ్బార్ భరోసా
భారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?
Tags : 1