ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!
Breaking News
ఏఐతో రుణ లభ్యతకు ఆటంకం కలగకూడదు
Published on Fri, 11/20/2026 - 03:47
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థల రూపకల్పనలో ఉండే లోపాలు, పక్షపాత ధోరణుల (బయాస్) కారణంగా గ్రామీణ రుణగ్రహీతలు, చిన్న వ్యాపారులు, కొత్తగా రుణాలు తీసుకునే వారికి రుణ లభ్యతకు ఆటంకాలు కలగకూడదని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి హెచ్చరించారు. గురువారం ‘ఎక్సలెన్స్ ఎనేబులర్స్’ నిర్వహించిన కార్యక్రమంలో శెట్టి ప్రసంగించారు. ఏఐ సాధనాల రూపకల్పన, వినియోగంలో ఆర్థిక సమ్మిళితత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
సరైన సాంకేతిక నిర్మాణంతో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చూడటం బ్యాంకు బోర్డుల బాధ్యత అని గుర్తుచేశారు. భారత్ వంటి విశాల, వైవిధ్యభరిత దేశంలో ఆవిష్కరణలు అవకాశాలను విస్తరించాలే తప్ప పరిమితం చేయకూడదన్నారు. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా కాకుండా, సంస్థల ప్రధాన ఉద్దేశాలకు అనుగుణంగా ఏఐ వినియోగం ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకు డైరెక్టర్లకు సైబర్ సెక్యూరిటీపై ఇచ్చే వార్షిక శిక్షణలో ఏఐ ప్రాథమిక అంశాలను కూడా చేర్చడం ముఖ్యమని సూచించారు.
ఏఐతో ఉత్పాదకత పెంచుకునే వీలు
ఏఐతో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో సామర్థ్యం, ఉత్పాదకత పెంచుకునే అవకాశాలు ఉన్నాయని శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ కూడా చెక్కుల క్లియరెన్స్, వ్యక్తిగత రుణాల మంజూరు వంటి ప్రక్రియల్లో కొన్నేళ్లుగా ఏఐని వినియోగిస్తోందని వెల్లడించారు. విభిన్న నేపథ్యాలున్న ఖాతాదారులకు సేవలందించే ఎస్‌బీఐకి ‘నిష్పక్షపాత వైఖరి’ అత్యంత కీలకమన్నారు. ఏఐ ఆధారిత రుణ మంజూరు వ్యవస్థల్లో పక్షపాత ధోరణులను నివారించడం అత్యంత కీలకమని అన్నారు.
పొరపాట్లతో భారీ మూల్యం
‘‘ఏఐ వ్యవస్థల్లో దొర్లే పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. ఆ లోపాలు కేవలం ఒక ప్రక్రియకే పరిమితం కాకుండా, అనుసంధానమై ఉన్న ఇతర వ్యవస్థలన్నింటికీ వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు ఇదే చూస్తున్నాం. అందువల్ల స్పష్టమైన అనుమతులు, లావాదేవీల పరిమితులు, ఆడిట్ ట్రయల్స్, అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే యంత్రాంగాలు అత్యంత ఆవశ్యకం’’ అని శెట్టి పేర్కొన్నారు.
Tags : 1