భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
Breaking News
నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
Published on Mon, 04/20/2026 - 13:00
నెలకు రూ. 1.90 లక్షల భారీ జీతం.. కేవలం నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది! ఒక కంపెనీకి అత్యంత కీలకమైన ఉద్యోగి అనిపించుకుని, ఏకంగా 90 శాతం జీతం పెంపు పొందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సైమన్ ఇంగారి అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ పంచుకున్న ఈ ఉదంతం, రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే కౌంటర్ ఆఫర్లను నమ్మి వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కళ్లకు కడుతోంది.
కథనంలోకి వెళ్తే.. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో మెరుగైన ఆఫర్ రావడంతో తన ప్రస్తుత సంస్థకు రాజీనామా లేఖ సమర్పించాడు. అప్పటి వరకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న అతనికి, కొత్త చోట రూ. 1.70 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఉద్యోగి రాజీనామాతో షాక్ తిన్న హెచ్‌ఆర్ విభాగం, అతడిని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ. 1.90 లక్షల జీతం ఇస్తామని 'కౌంటర్ ఆఫర్' ఇచ్చింది. కంపెనీ తనను ఇంతలా గుర్తిస్తోందని మురిసిపోయిన సదరు ఉద్యోగి, తన రాజీనామాను వెనక్కి తీసుకుని పాత సంస్థలోనే ఉండిపోయాడు.
అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత కంపెనీ ఆ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతూ లేఖ పంపింది. వ్యాపార లాభాలు తగ్గడం వల్ల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నామని, అందుకే తొలగిస్తున్నామని కంపెనీ కుంటిసాకులు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కొత్తగా ఒక అసిస్టెంట్‌ను నియమించుకోవడం గమనార్హం. కేవలం రెండు వారాల్లోనే బాధ్యతలన్నీ అప్పగించి వెళ్లిపోవాలని సీనియర్ మేనేజ్‌మెంట్ నుండి ఆదేశాలు వచ్చాయని నిర్మొహమాటంగా చెప్పేసింది.
ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని ఒక చేదు నిజానికి నిదర్శనం. ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే పెంపుదలలు కేవలం తక్షణ ప్రత్యామ్నాయం దొరికే వరకు చేసే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెంపుతో ఉద్యోగిని ఆపి, ఆ లోపు అతని బాధ్యతలను ఇతరులకు బదిలీ చేసే ప్లాన్ ఇందులో దాగి ఉండవచ్చు. అందుకే, ఒక్కసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాక, కౌంటర్ ఆఫర్లకు లోబడి వెనక్కి తగ్గడం క్షేమం కాదని ఈ కథనం హెచ్చరిస్తోంది.
Tags : 1