Breaking News

అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం

Published on Sun, 12/29/2024 - 05:01

సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్‌)/కడప కోటిరెడ్డి సర్కిల్‌: వైఎస్సార్‌ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహా­ద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

కలిసిరాని వ్యవసాయం..
వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్‌ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివా­ర­ణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయి­నా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండ­డంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవ­పెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్‌ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.

క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..
వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.

భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..
విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీ­నాయక్, ఎస్‌ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు­చేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీ
అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్‌ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమా­రుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్‌చార్జి ఎస్పీతో మాట్లా­డామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్‌
రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.

నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్య
కొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.

ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్‌ఐ బాబా ఫకృద్దీన్‌ తెలిపారు. తహసీల్దార్‌ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్‌లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)