పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం
Breaking News
బడి బాగుకోసం..
Published on Tue, 06/17/2025 - 05:21
హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ ఈదులగొంది మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సమస్య పరిష్కారానికి సంకలి్పంచారు. ఆయన సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చారు. ఈ నిధులకు గ్రామస్తుల శ్రమదానం జోడించి పాఠశాలకు సొంత భవనం సమకూర్చారు.
హుకుంపేట: పాఠశాలకు వసతి సమస్య పరిష్కరించేందుకు ఓ ఉపాధ్యాయుడు సొంత నిధులు వెచ్చించారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వసతి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని శోభకోట పంచాయతీ ఈదులగొంది చిన్న గ్రామం. ఇక్కడ పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పక్కా భవనం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులంతా శ్రమదానంతో మట్టిగోడలు నిర్మించి రేకులతో షెడ్డు ఏర్పాటుచేసుకుని తాత్కాలికంగా వసతి సమస్య కల్పించారు. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలకు రెండేళ్ల క్రితం వచ్చిన ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యను గుర్తించారు.
సమస్య పరిష్కరించేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ఆయన స్నేహితులైన ఉపాధ్యాయుడు రాజేంద్ర తదితరులు ఆర్థిక సహకారం అందించారు. మొత్తంమీద భవన నిర్మాణానికి ఉపాధ్యాయుడు రూ.లక్ష వరకు నిధులు సమకూర్చారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించారు. పాఠశాల భవనాన్ని నిర్మించి వసతులు కల్పించారు.
ఆదర్శంగా తీసుకోవాలి
ఈదులగొంది గ్రామంలో పాఠశాల సమస్య తెలుసుకున్న ఉపాధ్యాయుడు సొంత డబ్బులుతో పాఠశాల నిర్మించడం గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి. – ఈశ్వరరావు, ఎంఈవో–2
Tags : 1