అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
పదహారేళ్ల తర్వాత ముందస్తు పలకరింపు..!
Published on Fri, 05/23/2025 - 04:56
సాక్షి, విశాఖపట్నం: పదహారేళ్ల తర్వాత.. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా.. ఈ నెల 26 నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలున్నాయి. మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం 2009 తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఎల్నినో ప్రభావం లేకపోవడం రుతుపవనాల ముందస్తు రాకకు కారణమని పేర్కొంటున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం..
» తూర్పు–పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుండి నడిపిస్తోంది.
» ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్, అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది.
» ఈనెల 24 నాటికి రుతు పవనాలు కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 26 నాటికి రాయలసీమ అంతటా.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి. 28 నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం, 29 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
» ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు 104 శాతం కంటే 5 శాతం అదనంగా పడే సూచనలున్నాయి.
27న అల్పపీడనం!
ఓవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో.. మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది.
గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ నెల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు. ఈనెల 1 నుంచి 21 వరకూ ఆంధ్రప్రదేశ్లో సాధారణ సగటు వర్షపాతం 39.2 మిమీ కాగా, 126 శాతం అధికంగా 88.5 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.
Tags : 1