Breaking News

'నాడు' నంబర్‌ 1.. 'నేడు' నంబర్‌ 8

Published on Sat, 07/18/2026 - 05:14

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ రెండేళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు! వందల పరిశ్రమలను రప్పించాం.. లక్షల మందికి ఉపాధి కల్పించేశాం.. ఉద్యోగాలిచ్చేశాం..! ఇంకా నిరుద్యోగ భృతితో ఏం పనంటూ దబాయించారు! అయితే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచా­రం.. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యా­త్రలు.. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్‌ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు.. అంతా బూటకమేనని నీతి ఆయోగ్‌ నివేదిక సాక్షిగా తేలిపోయింది. తాజాగా సులభతర వాణిజ్యం (ఈవోడీబీ) ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా మూడేళ్ల క్రితం నంబర్‌ వన్‌ ర్యాంకు నుంచి ఇప్పుడు అథఃపాతాళానికి దిగజారిపోవటం రాష్ట్రానికి దూరమవుతున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాతావరణానికి నిదర్శనమనే చర్చ పారిశ్రామికవర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. 

రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్‌బుక్‌ వేధింపులు, వాటాల వసూళ్లు, పారిశ్రామికవేత్తలపై రౌడీయిజానికి నీతి ఆయోగ్‌ నివేదిక అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్నదల్లా.. ఊరూ పేరూ లేని అనామక కంపెనీలను సృష్టించి అత్యంత విలువైన ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం.. వాటాలు వసూలు చేసుకోవడమేనని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. హిందుస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ దగ్గర నుంచి ఆజాద్‌ ఇండియా మొబిలిటీ, జిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తాజాగా నీతి ఆయోగ్‌ పేర్కొనడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఏపీ అప్పులు  రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏకంగా 35 శాతానికి చేరుకున్నాయని నీతి ఆయోగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయంటూ...
చంద్రబాబు సర్కారు పెట్టుబడుల పిట్ట కథలను నీతి ఆయోగ్‌ బట్టబయలు చేసింది. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ 2026 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకులను నీతిఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 36 రాష్ట్రాలకుగాను గుజరాత్‌ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా టాఫ్‌ ఫెర్ఫార్మెన్స్‌ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్‌ రన్నర్స్‌ రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. ఇన్‌ఫ్రా, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత,  ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి ఎనిమిది అంశాలను నీతి ఆయోగ్‌ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది. ఎనిమిది రంగాలలో డేటాను విశ్లేషించడం ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు దక్కగా, సర్వేలో 22.2 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది. చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఉంటే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది.

ర్యాంకుల వారీగా ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు వెల్లడిస్తున్న నీతి ఆయోగ్‌ నివేదిక 

17 పెద్ద రాష్ట్రాల్లో 6వ స్థానం.. 
దేశంలో 17 పెద్ద రాష్ట్రాల ర్యాంకుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్‌ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం దెబ్బతింటోందని పేర్కొంది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలు, ఆర్థిక పటిష్టత రంగాల్లో ఏపీ బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడైంది.

అధ్వాన్నంగా ఆర్థిక పరిస్థితి..
వ్యాపార అనుకూల వాతావరణ విధానాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇంత వెనుకంజలో ఉండటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ప్రధాన కారణమని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు  రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. ఇది పెద్ద రాష్ట్రాల జీఎస్‌డీపీ అప్పుల సగటు నిష్పత్తితో పోలిస్తే ఏకంగా 13 శాతం అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో 17 రాష్ట్రాల సగటు అప్పుల నిష్పత్తి 22 శాతం మాత్రమే కావడం గమనార్హం.

నాడు కోవిడ్‌లోనూ నంబర్‌ 1..
కోవిడ్‌ లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని కూడా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఏకంగా 8వ స్థానంలోకి పడిపోయింది. దారుణం ఏమిటంటే గోవా, ఒడిశా లాంటి చిన్న రాష్ట్రాల కంటే కూడా ఏపీ వెనుకబడి పోవడం!


కప్పం కట్టలేక పారిపోతున్న కంపెనీలు...!
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో మొదటి ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్‌ ఇండియా మొబిలిటీ, 6వ ఎస్‌ఐపీబీలో ఆమోదించిన జ్యూపిటర్‌ రెన్యువబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏడో ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన జిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ లాంటి పలు కంపెనీలు రాష్ట్రం నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్‌ టెక్నాలజీస్‌ విశాఖలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్‌ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 నవంబర్‌ 12న మధురవాడలో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకొని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ  రూ.6,215 కోట్లకుపైగా ఉండటం రాష్ట్రంలో  దిగజారిన పారిశ్రామిక వాతావరణం, టీడీపీ పెద్దల కప్పం వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)