నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ
Published on Thu, 06/04/2026 - 04:13
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ ఆలయం టీటీడీకి అనుబంధంగా ఉంది. ఆలయంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉన్న సమయంలోనే అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు హుండీలను పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకుపోయారు. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని 2015లో టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు.
ఇంత ప్రసిద్ధి గాంచిన ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయం వెనుక నుంచి ప్రవేశించి ఉత్సవమూర్తులకు ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో హుండీని, ఆండాళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్లతో పెకిలించారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకుపోయారు. అపహరణకు గురైన సొమ్ము సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు చెబుతుండగా, సుమారు రూ.4లక్షలు పైనే ఉంటుందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సెక్యూరిటీ ఉన్నా కూడా చోరీ ..!
ఈ ఏడాది మార్చి 5వ తేదీన హుండీల కానుకలను లెక్కించారు. ఏటా స్వామివారికి కానుకల రూపంలో సుమారు రూ.40 లక్షల మేర ఆదాయం లభిస్తుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి తెల్లవస్త్రంలో మూటకట్టి ఆస్థాన మండపంలోని హుండీలో ఉంచినట్టు దేవస్థానం వారు చెబుతున్నారు. అయితే పోలీస్ జాగిలాలు ఆలయం వెనుక కొండ ప్రాంతంలో ఆ ఆభరణాల మూటను గుర్తించాయి. పోలీసులు, దేవస్థానం అధికారుల సçమక్షంలో తూకం వేయగా 56 గ్రాముల బంగారం, 2.70 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
దుండగులు మిషన్తో గర్భగుడి తలుపులు కత్తిరించడానికి యత్నించి రాకపోవడంతో వదిలేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి, అడ్డురోడ్డు సీఐలు జె.మురళి, ఎల్.రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు క్లూస్ టీములను రప్పించి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
Tags : 1