ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
Breaking News
ఏపీలో క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
Published on Tue, 01/03/2023 - 07:56
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరోవైపు ఏపీలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి క్రమంగా పెరుగుతోంది.
అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆయా జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జి.మాడుగులలో 11.6 డిగ్రీలు, వాల్మీకిపురం(అన్నమయ్య)లో 12.6, ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు)లో 13.1, మడకశిర (శ్రీసత్యసాయి)లో 13.2, సోమాల (చిత్తూరు)లో 13.7, బెలుగుప్ప (అనంతపుర)లో 14.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Tags : 1