మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రభుత్వాల విధి
Published on Sat, 06/13/2026 - 05:08
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి అని హైకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు తమను తాము సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని స్పష్టంచేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనమన్నది జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. రోడ్ల పక్కన తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్‌జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ఉండే భయాలను తొలగించినట్లవుతుందని పేర్కొంది.
అయితే పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదని, ఏడాది పొడవునా వాటిని సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఉద్ఘాటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు.
విశాఖపట్నం, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం బస్‌డిపో సమీపంలో తమ ఇళ్ల ఎదురుగా ఉన్న జీవీఎంసీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కె.చిన్నస్వామి శెట్టి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపితే ఆ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చునని పిటిషనర్లకు సూచించారు.
Tags : 1