Breaking News

‘నైరుతి’కి తంటా!.. ఆ రెండు తుపానుల వల్లే..  

Published on Wed, 06/14/2023 - 05:38

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు ఇవి అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాడ్పులు విజృంభిస్తుంటే మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. సాధారణంగా అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశంతో ‘నైరుతి’ ఆగమన ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి పది రోజుల్లో జూన్‌ ఒకటో తేదీ నాటికి కేరళను తాకుతాయి.

అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అండమాన్‌ సముద్రంలోకి నిర్ణీత సమయానికి రెండ్రోజుల ముందే అంటే మే 18 నాటికే రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి అవి బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు చాలా నెమ్మదిగా విస్తరించాయి. దీంతో ఈ రుతుపవనాలు కేరళలోకి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న ప్రవేశించాయి.

ఆ తర్వాత కూడా అవి ఆశించినంతగా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. పైగా రోహిణీకార్తె వెళ్లి మృగశిర కార్తె ప్రవేశించినా ఇంకా రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే (42–45 డిగ్రీల వరకు) నమోదవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఈనెల 18 వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  

ఆ రెండు తుపానుల వల్లే.. 
రుతుపవనాల ప్రవేశానికే కాదు.. వాటి విస్తరణలో ఆలస్యానికి ఇటీవల సంభవించిన తుపానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అనంతరం అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్‌ వైపు పయనించి తీరాన్ని దాటింది. దీంతో బంగాళాఖాతంలోని తేమను ఈ తుపాను అటు వైపు లాక్కుని పోయింది. దీంతో రుతుపవనాలు బంగాళాఖాతంలోకి వేగంగా విస్తరించకుండా, ఆపై కేరళలోకి సకాలంలో ప్రవేశించకుండా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 8న నైరుతి రుతుపవనాలు కేరళను తాకినా ఆ తర్వాత కూడా మందగమనమే కొనసాగుతోంది.

తాజాగా అరేబియా సముద్రంలో ఈనెల 6న ‘బిపర్‌జోయ్‌’ తుపాను సంభవించింది. ఈ తుపాను కూడా అత్యంత తీవ్ర తుపానుగా బలపడి గుజరాత్‌ వైపు పయనిస్తోంది. ఈ తుపాను కూడా ‘మోకా’ మాదిరిగానే నైరుతి రుతుపవనాల వేగానికి కళ్లెం వేసింది. అరేబియా సము­ద్రంలోని తేమను తుపాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోవడంతో రుతుపవనాలు ఆశించినంతగా విస్తరించడం లేదు.. వర్షించడం లేదు. వాస్తవానికి సాధారణ పరిస్థితులుంటే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది.

అయితే ఇప్పటికీ రాయలసీమలో ఒక­ట్రెండు చోట్ల అరకొరగా మినహా రాష్ట్రంలో ఎక్కడా రుతుపవనాల వర్షాలు కురవడం లేదు. ఇంకా రాష్ట్రం­లో ఎక్కడైనా అడపా దడపా వానలు కురుస్తుండడానికి రుతుపవనాల ఆగమనానికి ముందస్తుగా ఏర్పడే థండర్‌ స్టార్మ్‌ (ఉరుములు, మెరుపులు, పిడుగులు ఈదురుగాలులతో కూడిన వాతావరణం) పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 18 తర్వాతే రాష్ట్రంలో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.  

మందకొడిగా నైరుతి రుతుపవనాలు.. 
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా మందకొడిగా కదులుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అవి శ్రీహరికోట వద్ద రాయలసీమను తాకినా ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఈపాటికి రాయలసీమలోని అన్ని జిల్లాలకు విస్తరించి తెలంగాణ, కోస్తా జిల్లా­ల్లోకి ప్రవేశించాల్సివుంది. కానీ మంగళవారం నాటికి ఇంకా రాయలసీమలోనే పూర్తిగా విస్త­రించలేదు. అనంతపురం, సత్యసాయి, చిత్తూ­రు జిల్లాలకు కొద్దిమేర విస్తరించినా అక్కడ పెద్దగా వర్షాలు కూడా పడడంలేదు.

ఈ నెల 16 వరకు రుతుపవనాలు ఇలా నెమ్మదిగానే కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శా­ఖాదికారులు తెలిపారు. బిపర్‌జోయ్‌ తుపా­ను ప్రభావం 16వ తేదీ నుంచి తగ్గే అవకాశం ఉండడంతో ఆ తర్వాత రుతుపవనాల గమనంలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. 20 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటి నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నా అది నామమాత్రంగానే ఉంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)