ముడుపుల మతలబు..ఆయకట్టు తగ్గింపు.. కాంట్రాక్టు వ్యయం రెట్టింపు

Published on Mon, 07/20/2026 - 05:13

సాక్షి, అమరావతి: ఆయకట్టు పది వేల ఎకరాలు తగ్గితే ఆ మేరకు పనుల అంచనా వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపు అయింది. అందువల్ల చేతులు మారిన ముడుపుల బరువూ పెరిగింది. ఈ మాయాజాలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులు వేదికయ్యాయి. ఇంజినీరింగ్‌ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్న ఆ కథకమామిషూ ఇలా ఉంది. అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా 36ఏ ప్యాకేజీలో పేరూరు బ్రాంచ్‌ కెనాల్, హగరి బ్రాంచ్‌ కెనాల్, మాల్యం బ్రాంచ్‌ కెనాల్, ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనుల్లో మిగిలిన పనులకు ఇటీవల రూ.440.89 కోట్ల అంచనా వ్యయంతో జల వనరుల శాఖ టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.86 శాతం అధిక ధరకు అంటే రూ.462.32 కోట్లకు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. సీనరేజీ, జీఎస్టీ వంటి పన్నుల రూపంలో రూ.160.61 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఆ పనుల మొత్తం కాంట్రాక్టు విలువ రూ.622.93 కోట్లన్నమాట.  

ఇంతై.. ఇంతింతై.. 
⇒ హంద్రీ–నీవా తొలి దశలో 36ఏ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్‌ కెనాల్‌ 6.07 కిలోమీటర్లు, హగరి బ్రాంచ్‌ కెనాల్‌ 27.50 కి.మీ, మాల్యం బ్రాంచ్‌ కెనాల్‌ తవ్వి.. వాటి కింద 80,600 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.93.29 కోట్లకు ఓం–రే(జేవీ) సంస్థ 2005 ఫిబ్రవరి 10న దక్కించుకుంది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్లలోగా ఆ పనులు పూర్తి చేయాలి. రూ.39.16 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది.  

⇒ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. ఏపీడీఎస్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ డీడెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌)లో సెక్షన్‌–61 కింద ఓం–రే(జేవీ)పై వేటు వేసింది. ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.54.13 కోట్లు. కానీ.. 2014లో దానిని రెండుగా 36ఏ, 36బీ ప్యాకేజీలుగా విభజించి 2015–16 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసింది. 

⇒ 36ఏ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్‌ కెనాల్‌ను 1.8 కి.మీ నుంచి 3.27 కి.మీ వరకు హగరి, మాల్యం బ్రాంచ్‌ కెనాల్‌లలో మిగిలిన పనులు పూర్తి చేసి, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 65,600 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.244.72 కోట్లకు 2017 జూలై 28న సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించింది. 36బీ ప్యాకేజీలో 11వ పంపింగ్‌ స్టేషన్‌ కింద కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.19.29 కోట్లకు 2017 జూలై 13న ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించింది. ఈ రెండు ప్యాకేజీల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది నిబంధన. 

⇒ 2019 నాటికి 36ఏ ప్యాకేజీలో సీఎం రమేష్‌ సంస్థ రూ.35.17 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. అంటే.. ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.209.55 కోట్లే.

రాయదుర్గం ఆయకట్టు కట్‌.. అంచనా వ్యయం రెట్టింపు
చంద్రబాబు సర్కార్‌ 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులకు ఇటీవల టెండర్లు పిలిచింది. 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులు పూర్తి చేసి, ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ.440.89 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అంటే.. రాయదర్గం నియోజకవర్గం పరిధిలో పది వేల ఎకరాల ఆయకట్టును తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.86 శాతం అధిక ధరకు రూ.462.32 కోట్లకు ఎన్‌సీసీకి కట్టబెట్టింది. 

జీఎస్టీ, సీనరేజీ పన్నుల రూపంలో రూ.160.61 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.622.93 కోట్లు.. కాంట్రాక్టు వ్యయం రూ.413.38 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ.. 2019 నాటికి ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.209.55 కోట్లే. ఈ పనుల్లో అధిక భాగం మట్టి పనులే. బ్రిడ్జిలు, ఇతర కాంక్రీట్‌ నిర్మాణాల పనులు తక్కువే. ఆయకట్టు కూడా పది వేల ఎకరాలు తగ్గింది. అయినా సరే కాంట్రాక్టు విలువ రెట్టింపు అవడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్య నేతకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.   

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)