Breaking News

నిన్న కరెంట్‌ చార్జీలు.. నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు బాదుడే బాదుడు

Published on Thu, 12/19/2024 - 04:39

రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా, ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో కరెంట్‌ చార్జీలను ఎడా పెడా బాదేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంభించని రీతిలో ల్యాండ్‌ ధరలను పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువనూ అమాంతం ఆకాశాన్నంటించింది. 

విలువల పెంపునకు కాదేదీ అనర్హం.. అన్నట్లు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలక పోవడం విస్తుగొలుపుతోంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం రేట్లు ఫిక్స్‌ చేస్తోంది. సంపద సృష్టించడం అంటే ఇదే కాబోలు అని జనం వాపోయేలా చేసింది.

విజయవాడలోని పటమట ప్రాంతంలో ప్రస్తుతం రూ.కోటి  విలువైన ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8 లక్షలు. ఇప్పుడు దాని విలువ 30% పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు అదనంగా రూ.2.50 లక్షలు.. అంటే రూ.10.50 లక్షలు కట్టాల్సి వస్తుంది. గుంటూరు రూరల్‌ ప్రాంతంలో రూ.30 లక్షల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుతం రూ.2.40 లక్షలు అవుతుండగా.. అవి రూ.3 లక్షలకు పెరగనున్నాయి. 

ఇలా అన్ని చోట్లా భూముల విలువను బట్టి రేట్లు భారీగా పెరిగిపోనున్నాయి. జనవరి 1  నుంచి ఈ పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మంగళవారం రాత్రి మెమో, ప్రొసీడింగ్స్‌  (ఎంవీ1/752/2022) జారీ చేశారు.  

సాక్షి, అమరావతి: ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెను భారాలు మోపుతోంది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్‌) విలువను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే నిర్మాణాల విలువను నిర్ధారించింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లనూ వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20 శాతం వరకు పెంపు ఉంటుందని చెబుతున్నా 50 శాతం వరకు పెంచుతున్నారని తెలుస్తోంది. 

అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60 శాతం వరకు పెంచేస్తున్నారు. దీంతో నగరాల్లో అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసిన వారిపై అదనంగా రూ.లక్షల భారం పడనుంది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా, దొడ్డిదారిన దాని క్లాసిఫికేషన్‌ మార్చి రెండవ విలువను పెట్టాలని నిర్ణయించారు. దీనికి కొ­త్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. 

ప్ర­స్తుతం వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్‌ చేసిన భూమిగా.. ఇళ్ల స్థలాలైతే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నవి.. వాటి వెనుక ఉ­న్నవి.. అంటూ పలు రకాలుగా క్లాసిఫికేషన్‌లో ఉ­న్నా­యి. ఒక ఏరియాలో మెట్ట భూమి విలువ రూ.10 లక్షలు, మాగాణి భూమి విలువ రూ.20 లక్షలుగా ఉందనుకుందాం. ఇప్పుడు రూ.10 లక్షలు ఉన్న మెట్ట భూమిలో ఒకచోట రూ.15 లక్షలు, పక్కనే ఉన్న దానికి రూ.20 లక్షలు పెడుతున్నారు. అంటే ప్రతి క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటు పెడుతున్నారు. 

జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్‌ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు.

వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు రకరకాలుగా మార్చారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతి దాని రేటు మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్‌ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచేశారు. 



ఏరియాను బట్టి కాదు.. స్థలాన్ని బట్టి రేటు 
సాధారణంగా భూముల విలువను.. ఉన్న దానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం గుట్టుచప్పు­డు కాకుండా క్లాసి­ఫికేషన్లు మార్చుతున్నారు. దీంతో ప్రతి వ్య­వసాయ, నివాస, వాణిజ్య భూములతోపా­టు అర్బన్‌ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మా­ర్కెట్‌ విలువలు అమాంతం పెరిగిపోనున్నా­యి.

ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలు పెరిగిపోనున్నాయి. ఎక్కడైనా ఈ ఏరియాలో భూమి రేటు ఎంత ఉందని అడగడం సహజం. కానీ ఇకపై ఆ ఏరియాలోని ప్రతి స్థలం రేటు.. రోడ్డు పక్కన ఒకలా, రోడ్డు లోపల మరోలా మారిపోవడం వల్ల రేటు చెప్పడం అంత సులువు కాదు.  

27 నాటికి తుది విలువలకు ఆమోదం 
భూముల మార్కెట్‌ విలువల పెంపునకు సంబంధించి ఇప్ప­టికే సబ్‌ రిజి్రస్టార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ షెడ్యూల్‌ కూడా ఇచ్చింది. 18వ తేదీ లోపు మార్కెట్‌ విలువను నిర్ధారించాలని షెడ్యూల్‌ ఇవ్వడంతో దాదాపు అన్ని చోట్లా వాటిని ఖరారు చేశారు. 19వ తేదీ ఆయా జిల్లాల్లో జా­యింట్‌ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు వీటికి ఆమోదం తెలపనున్నాయి. 20వ తేదీ.. పెరిగిన ఈ విలువలను సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో అంటించడంతోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీ­కరించాలని సూచించారు.

అభ్యంతరాల స్వీకరణ, వా­టికి వివరణలు ఇవ్వడం, డేటా ఎంట్రీ పనులన్నీ 26వ తేదీలోపు పూర్తి చేసి.. 27న మార్కెట్‌ విలువకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ విలువలను అమల్లోకి తెచ్చి, వాటి ప్రకారమే రిజి్రస్టేషన్ల చార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా  సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో పని జరుగుతోంది.

పూరి పాకలనూ వదల్లేదు 
ఇప్పటికే నిర్మాణాల విలువను ప్రభుత్వం ఖరా­రు చేసి ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పం­చాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్‌ నిర్మాణాలు, నాన్‌ ఆర్‌సీసీ రూఫ్‌లతోపాటు పూరిళ్లు, గోడలు లేని ఇళ్ల విలువనూ  పెంచేసింది.  కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువను రూ.1,490కి పెంచింది. 

నగర పంచాయతీల్లో చదరపు అడుగు రూ.1,270, గ్రామ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.900కు పెంచింది. సెల్లార్, పార్కింగ్‌ ఏరియాతోపాటు ప్రతి అంతస్తులో అదనపు ఫ్లోర్లకు రేటు పెంచారు. వాణిజ్య భవనాల విలువను కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రూ.1,800కు, నగర పంచాయతీల్లో రూ.1,540కి, పంచాయతీల్లో రూ.1060కు పెంచారు. 

ఇతర ఆర్‌సీసీ నిర్మాణాలే కాకుండా ఆర్‌సీసీ రూఫ్‌లు లేని ఇళ్ల విలువను సైతం పెంచేశారు. చివరికి పెంకుటిళ్లు, పాకలు, గోడలు లేని ఇళ్లను సైతం వదలకుండా వాటి విలువను చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.20 వరకూ పెంచింది. అన్ని రకాల నిర్మాణాల్లోనూ ఎస్‌ఎఫ్‌టీ రేటు రూ.30 నుంచి రూ.90 వరకు పెంచారు.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)