అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
బాబు సర్కారు అప్పు.. రెండేళ్లలోనే.. రూ.3,63,406 కోట్లు
Published on Wed, 07/29/2026 - 05:39
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అందినకాడికి అప్పులు చేయడమే ఆనవాయితీగా మార్చుకున్న చంద్రబాబు సర్కారు వాటిని ఏమాత్రం ప్రతిఫలం లేని రెవెన్యూ వ్యయానికి మళ్లించేస్తోంది. దీంతో అప్పులు భారీగా పెరిగిపోతుండగా ఆస్తులు కుచించుకుపోతున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి మూడు నెలల్లోనే ఏకంగా రూ.33,612 కోట్లు బడ్జెట్ అప్పు చేసినట్లు కాగ్ నెలవారీ బడ్జెట్ సూచికల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే నెలకు రూ.11 వేల కోట్లకు పైగా అప్పులు చేస్తుండటంతో రాష్ట్రం రుణాల ఊబిలో కూరుకుపోతోంది. ప్రజల తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ రాబడిని పెంచకపోగా అప్పుల పెనుభారం మోపుతున్నారు. మరోపక్కప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలు ఊసు లేదు.
నిరుద్యోగులకు భృతి లేదు, ఉద్యోగాలూ ఇవ్వలేదు. తాజాగా మంగళవారం చంద్రబాబు సర్కారు మరో రూ.2,600 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో రెండేళ్ల రెండు నెలల్లోనే చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.3,63,406 కోట్లు అప్పులు చేసింది. ఇందులో కాగ్, ఆర్బీఐ గణాంకాల మేరకు బడ్జెట్ అప్పులే రూ.2,02,615 కోట్లకు చేరాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,13,404 కోట్లకు పెరిగాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.47,387 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రోజూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లు, ఓడీలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. చేబదుళ్లకు భారీ వడ్డీలను కూడా చెల్లిస్తున్నట్లు ఇటీవల కాగ్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.
Tags : 1