Breaking News

ప్రకృతిని చెరబట్టొద్దు

Published on Sat, 07/18/2026 - 05:05

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తుండటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ‘గాలి, నీరు, అడవులు వంటివి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి ఏ ఒక్క వ్యక్తికో, ప్రైవేట్‌ సంస్థకో సొంతం కాదు. సమాజంలోని ప్రజలందరికీ వీటిని సమానంగా పొందే హక్కు ఉంది. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వం కేవలం ప్రజల తరఫున ఒక సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించాలి. 

ప్రజల శ్రేయస్సు కోసం ఈ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇదే పబ్లిక్‌ ట్రస్ట్‌ సిద్ధాంతం. సహజ వనరులు జాతీయ ఆస్తులు. ప్రకృతి ప్రసాదించిన వనరులు ఏ ఒక్క తరం వాడి పారేసే వస్తువులు కావు. ఈ వనరులను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎకనావిుక్‌ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్న కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. 

సహజ వనరుల పరిరక్షణ నిమిత్తం ఈ ఏడాది మే 8న జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌ఓపీ) కచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహజ వనరుల దోపిడీని అడ్డుకునేందుకు వీలుగా ప్రతి ఏడాది సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు రెండు రోజుల క్రితం తీర్పునిచ్చారు.

చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతిపై పిటిషన్‌ 
కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ స్థానికులు బొడ్డు సత్యవతి, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు సాగు, తాగు నీటికి కన్నంనాయుడు చెరువే ఆధారమన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్వరరావు విచారణ జరిపారు. ‘పర్యావరణ పరిరక్షణ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆలోచనేమీ కాదు. ముఖ్యంగా భారత్‌లో ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం అన్నది మన సంస్కృతి, జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తోంది.

మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన నీరు, ఇతర సహజ వనరులను ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు పవిత్రమైనవిగా భావిస్తాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న ‘పబ్లిక్‌ ట్రస్ట్‌ సిద్ధాంతం’ మూలాలు ఈ ఆధ్యాత్మిక బోధనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘జీవించే హక్కు’ అంటే కేవలం మనుషులు శ్వాస తీసుకుంటూ, భౌతికంగా బతికి ఉండటం మాత్రమే కాదు. ప్రతి మనిషీ స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా జీవించడం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాంట్రాక్టర్లేమీ సేవ చేయడం లేదు 
‘జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలనే లక్ష్యం దేశ ప్రగతికి ఎంత అవసరమో.. ఆ ప్రక్రియలో చట్టపరమైన పరిధులను, క్షేత్ర స్థాయి వాస్తవాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జాతీయ రహదారుల అథారిటీ నుండి పనులు పొందిన కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాలను ఉచితంగా, స్వచ్ఛంద సేవగా చేయడం లేదు. వారు ఈ కమర్షియల్‌ కాంట్రాక్ట్‌ ద్వారా భారీ మొత్తంలో డబ్బును, లాభాలను ఆర్జిస్తున్నారు. కాబట్టి, సాధారణ వ్యాపార నిబంధనలు, పౌర చట్టాలు వారికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక వంటి సహజ వనరులను సేకరించడం పూర్తిగా ఆయా కాంట్రాక్టర్ల బాధ్యత. చట్టం విధించిన కఠిన నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం నేరం’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

ముందు తరాలు కాపాడినందునే మనం జీవిస్తున్నాం 
‘పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు లేదా విధించే చట్టపరమైన ఆంక్షలు తక్షణమే కంటికి కనిపించే ఆర్థిక లాభాలను ఇవ్వకపోవచ్చు. కానీ, ఆ నిర్ణయాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తే, అది మన తర్వాత రాబోయే బిడ్డలకు మనం ఇచ్చే అత్యంత విలువైన కానుక. మన ముందు తరాలు ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేయకుండా, కొంత వరకు కాపాడగలిగారు కాబట్టే.. ఈ రోజు మనం ఈ భూమిపై శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ వారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రకృతిని పూర్తిగా దోచేసి ఉంటే, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న జీవించే హక్కు, దాని విస్తృత పరిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యేవి. దీంతో మన మనుగడే ప్రశ్నార్థకమయ్యేది’ అని తెలిపారు.

ఆ జలాశయాలు కీర్తి కోసం కట్టినవి కావు 
‘ప్రజల కోసం శతాబ్దాల క్రితం నిర్మించిన జలాశయాలు కేవలం రాజుల కీర్తి కోసం కట్టినవి కావు. రాబోయే తరాల సంక్షేమం కోసం వారు తలపెట్టిన పవిత్ర యజ్ఞాలు. ప్రకాశం జిల్లాలో కంభం చెరువు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని పోరుమామిళ్లలో అనంతరాజ సాగర్, అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం చెరువులు ఇలా నిర్మితమైనవే.

పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం లేదా ఉదాసీనత వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు తమకు లభించిన అంతర్గత అధికారాలను ఉపయోగిస్తాయి. సంపూర్ణ న్యాయం చేయడం కోసం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ కోర్టు కూడా తన అంతర్గత అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు ఇస్తోంది’ అని జస్టిస్‌ మహేశ్వరరావు తన తీర్పులో తేల్చి చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)