Breaking News

అసెండాస్ చేతిలో అమరావతి

Published on Mon, 08/31/2015 - 01:02

మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక.. తొలి దశలో 3వేల ఎకరాలు
ఐకానిక్ కాంప్లెక్స్‌కు ఉచితంగా 250 ఎకరాలు
375 ఎకరాల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లు...
సింగపూర్ కంపెనీతో సర్కారు బేరసారాలు, మంతనాలు
సింగపూర్... ఏపీ ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వ పెద్దలు మంతనాలు, బేరసారాలను కొనసాగిస్తున్నారు.

ఆ కంపెనీ ఎండీతో రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్‌డీఏ) చర్చలు జరుపుతోంది. పూర్తి వాణిజ్య విధానంలోనే మాస్టర్ డెవలపర్ సంస్థ ఎంపికను చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అసెండాస్ కంపెనీ ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. తొలిదశలో 3వేల ఎకరాలను కంపెనీకి అప్పగించనున్నారు. ఇందులో 375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణ బాధ్యతలనూ అసెండాస్‌కే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
 
పూర్తి హక్కుల కోసం కంపెనీ షరతులు
తొలిదశలో ఇచ్చే 3వేల ఎకరాల భూములపై పూర్తి హక్కులు ఇవ్వాల్సిందిగా అసెండాస్ కంపెనీ షరతు విధించింది. ఐకానిక్ కాంప్లెక్స్(భారీ వాణిజ్య సముదాయం) నిర్మాణం కోసం 250 ఎకరాలను కంపెనీకి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్ నిర్మించిన తర్వాత కంపెనీ విక్రయించుకోనుంది. అందుకు అనుగుణంగా ఈ 250 ఎకరాలపై హక్కులు ఇవ్వాల్సిందిగా షరతు విధించింది. రాష్ట్రప్రభుత్వం 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తామని, అభివృద్ధి చేసిన తర్వాత హక్కులు కల్పిస్తామని చెబుతున్నట్టు తెలిసింది.

ఈ 250 ఎకరాల్లో కనీసం 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు కంపెనీ అంగీకరించింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికను అక్టోబర్ 22వ తేదీ కన్నా ముందుగానే పూర్తి చేయాల్సిందిగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎటువంటి జాయింట్‌వెంచర్ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే నూతన రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వాలని షరతు విధించింది.

తొలిదశ రాజధాని అభివృద్ధి అక్టోబర్ 2018 నాటికి పూర్తి చేయడానికి కంపెనీ అంగీకరించింది. తొలిదశలో 3వేల ఎకరాల అభివృద్ధితోపాటు మిగతా రాజధాని అభివృద్ధిని 20 నుంచి 30 ఏళ్లల్లో అభివృద్ధి చేసే హక్కు కల్పించాలని అసెండాస్ పేర్కొంది. ఐదేళ్లలో 3వేల ఎకరాలను అభివృద్ధి చేయని పక్షంలో సమాంతర అభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. 70 శాతం అభివృద్ధి పూర్తి అయిన పిదప, తర్వాత దశ అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరుతోంది. అయితే, తర్వాత దశపైన ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం పేర్కొంటోంది.

భూమి ధరల నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా కంపెనీ ఎండీయే ఉంటారని, సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారు ఉంటారని అసెండాస్ స్పష్టం చేసింది. ఐకానిక్ కాంప్లెక్స్‌కు 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడంతోపాటు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని, రాజధానిలో మౌలికవసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే పంచుకోవాలని కంపెనీ పేర్కొంది.

రాజధాని నిర్మాణంలో ఇతరత్రా భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. సంయుక్త అమలు కమిటీకి, బృహత్తర ప్రణాళికపై ఏపీ, సింగపూర్‌ల మధ్య అవగాహన ఒప్పందానికి అంగీకరిస్తామని అసెండాస్ తెలిపింది. మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకునే క్లాజును చేర్చేందుకు కంపెనీ అంగీకరించడం లేదు. నూతన రాజధాని నిర్మాణం శంకుస్థాపనకోసం అక్టోబర్ 22న సింగపూర్ ప్రధానమంత్రి రావడానికి ముందుగానే స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఖరారు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

నూతన రాజధానిలో రహదారులు, నీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలికవసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే వ్యయాన్ని పూర్తిగా మాస్టర్ డెవలపర్‌గా ఎంపికయ్యే సంస్థనే తొలుత భరిస్తుంది. నూతన రాజధానిలో పరిశ్రమలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నారు. ఆ భూములపై లీజు ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్‌డీఏకు వచ్చిన నిధులను మాస్టర్ డెవలపర్‌కు ప్రభుత్వం చెల్లించనుంది.
 
‘రాజధాని’ పరిధిలో సవివరమైన ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీములో భూములిచ్చిన వారికి ఎక్కడ ప్లాట్లు ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించే బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి నామినేషన్‌పై అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే జాప్యం అయిందని, కొత్తగా కంపెనీలను ఆహ్వానించినా వారికి అవగాహన ఉండదని, సుర్బానా కంపెనీకి రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపొందించిన అనుభవం ఉన్నందున సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు బాధ్యతలను సుర్బానాకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సీఆర్‌డీఏ సమావేశంలో సుర్బానాకు రూ.11.92కోట్లకు నామినేషన్‌పై అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంస్థ 217చ.కి.మీ. పరిధిలో గల 6వేల హెక్టార్లలో సర్వే, ఎక్కడ ఏది రావాలో క్షేత్రస్థాయిలో మార్కింగ్, ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలో నిర్ధారిస్తుంది. 29 గ్రామాల్లోని వారికి పాట్లు ఎక్కడెక్కడ వస్తాయో మార్కింగ్ చేయడంతో పాటు 217 చ.కి.మీ. పరిధిలో భూమి వినియోగం, రవాణా, ఇతర మౌలికవసతుల ప్రణాళికను సుర్బానా రూపొందించనుంది. 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ 15కల్లా సవివరమైన ప్రణాళికను ప్రభుత్వానికి అందజేయాలి.

అప్పటి నుంచి మూడునెలల్లోగా ల్యాండ్‌పూలింగ్ స్కీము ప్రణాళికను, మొత్తం ప్రణాళికను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సుర్బానా సమర్పించిన ప్రతి పాదనలను యథాతథంగా ముఖ్యమంత్రి ఆమోదించారు. మాస్టర్ ప్రణాళిక ఖరారు కోసం ఒక హెక్టార్‌కు రూ.1,646 చొప్పున రూ.3.57కోట్ల వ్యయం అవుతుందన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు కోసం హెక్టార్‌కు రూ.3,292 చొప్పున రూ.7.15 కోట్ల వ్యయం, ఇతర మార్కింగ్‌ల కోసం హెక్టార్‌కు రూ.549 చొప్పున రూ.1.19 కోట్ల వ్యయం అవుతుందని సుర్బానా చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)