Breaking News

రాష్ట్రంలో బీరు పాలన: రోజా

Published on Wed, 07/05/2017 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల జీవితాలతో చెలగాట మాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు తిండి, నీళ్లు, పనులు లేక అల్లాడుతుంటే.. చంద్రబాబు మాత్రం తాగినోళ్లకు తాగినంత బీరు.. బారు అంటూ గడపగడపకూ మద్యాన్ని తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జవహర్‌ బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రకటించడంపై రోజా మండిపడ్డారు. అవి తాగే కేబినెట్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.

మహిళల తాళిబొట్లు తెగినా పర్లేదు.. కమీషన్లు కావాలి, ఖజానా నిండాలనే బాబు బారు పాలసీలను తీసుకురావడం దురదృష్టకరమన్నారు. జనావాసాలు, స్కూళ్లు, గుళ్ల వద్ద మద్యం షాపులు పెట్టాలనుకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవన్నీ పగలగొట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మహిళల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమన్నారు. హెరిటేజ్‌ వ్యాన్‌లోని ఎర్రచందనం దుంగలమీద బాబు మాట్లాడకపోతే ఇకనుంచి ఆయన్ను ఎర్రచంద్రం అని పిలవడం ఖాయమని ఎద్దేవా చేశారు.