5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
రైళ్లలో కొత్త ఫుడ్ మెనూ.. IRCTC కీలక నిర్ణయం!
Published on Thu, 11/26/2026 - 08:06
సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు అందించే ఆహారంలో విషయంలో ఇండియన్ రైల్వే కీలక మార్పులు తీసుకురానుంది. రైళ్లలో ఎక్కువ రకాల వంటకాలను అందించడం కంటే.. తక్కువ రకాల ఆహార పదార్థాలను మెరుగైన నాణ్యత, రుచి, పరిశుభ్రతతో అందించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త మెనూను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. విమానాల్లో ప్రయాణికులకు అందించే భోజనం తరహాలోనే ఈ కొత్త మెనూను రూపొందించారు.
ప్రస్తుతం ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ విధానం అమల్లో ఉంది. గతంలో రైళ్లలో ఆహారాన్ని అందించే సాధారణ క్యాటరింగ్ వ్యవస్థకు బదులుగా ప్రముఖ హోటల్ గ్రూపులు, క్లౌడ్ కిచెన్ల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. కామాఖ్య మార్గానికి మేఫెయిర్ గ్రూప్, హౌరా మార్గానికి తాజ్‌శాట్స్, మిగిలిన రెండు రైళ్లకు సరోవర్ పోర్టికో గ్రూప్ ఆహారాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా నాణ్యమైన ఆహారాన్ని ఒకే విధంగా తయారు చేసి, ప్యాకింగ్ చేసి ప్రయాణికులకు అందించాలన్నది రైల్వే లక్ష్యం.
కొత్త మెనూ ఇలా..
కొత్త మెనూ ప్రకారం.. ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులో అల్పాహారానికి ఇడ్లీ, వడతో పాటు చట్నీ, సాంబార్ లేదా పోహా లేదా ఉప్మా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పుతో పాటు చికెన్ లేదా వెజిటేరియన్ కూరను అందిస్తారు. గతంలో అల్పాహారంలో ఇచ్చే సూప్, ఆమ్లెట్, శాండ్‌విచ్, మజ్జిగ, చాక్లెట్లతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఇచ్చే పెరుగు, సలాడ్, ఊరగాయ, స్వీట్లు వంటి పదార్థాలను తొలగించారు.
అంతేకాకుండా.. ఒక్కో భోజనం మొత్తం బరువును కూడా తగ్గించారు. గతంలో 700 నుంచి 750 గ్రాముల వరకు ఉండే భోజనాన్ని ఇప్పుడు 450 నుంచి 500 గ్రాములకు పరిమితం చేశారు. కొత్త విధానంలో క్లౌడ్ కిచెన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేయడం ప్రారంభించిన తర్వాత ఆహార నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన ప్రయాణికుల ఫిర్యాదులు 10 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్తులో ఇతర సుదూర ప్రయాణ రైళ్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం రైళ్లలో కూడా ఇలాంటి పరిమిత మెనూను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు!
Tags : 1