Breaking News

ఒకే ఇంట్లో ఇద్దరు అపరిచితులు

Published on Thu, 11/26/2026 - 00:44

విడాకుల దాకా వెళ్లరు. అలాగని మనస్ఫూర్తిగా కలిసి ఉండరు. కేవలం పిల్లల భవిష్యత్తు కోసం ఇంటి బాధ్యతల కోసం సమాజం కోసం... ఒకే పైకప్పు కింద అపరిచితుల్లా కొనసాగుతుంటారు. ‘క్వైట్‌ క్విట్టింగ్‌’! నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో జంటల మధ్య చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద విడాకుల’పై కథనం.

ఉద్యోగంలో ఆసక్తి తగ్గినప్పుడు కొందరు రాజీనామా చేయరు, అలాగని మనసు పెట్టి పనిచేయరు. కేవలం ఉద్యోగం ఊడిపోకుండా ఉండేందుకు కనీస బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తూ కాలం వెళ్లదీస్తారు. కార్పొరేట్‌ ప్రపంచంలో దీనిని ‘క్వైట్‌ క్విట్టింగ్‌’ అంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే ధోరణి వైవాహిక బంధాల్లోనూ కనిపిస్తోంది. మన భారతీయ సమాజంలో విడాకులు తీసుకోవడం ఇప్పటికీ పెద్ద సవాలే. అందుకే ఎంతోమంది దంపతులు చట్టపరంగా విడిపోకపోయినా, మానసికంగా ఎప్పుడో విడిపోయి ఒకే ఇంట్లో అపరిచితుల్లా బతుకుతున్నారు. దీనినే రిలేషన్ షిప్‌ నిపుణులు ‘క్వైట్‌ డివోర్స్‌’ 
(నిశ్శబ్ద విడాకులు) అని పిలుస్తున్నారు.

కాపురమా.. ‘బిజినెస్‌ డీలా’?
భార్యాభర్తలు రోజంతా మాట్లాడుకుంటూనే ఉంటారు.. కానీ ఆ మాటల్లో ప్రేమ, ఆప్యాయత ఉండవు! కేవలం ఇంటి సరుకులు, పిల్లల స్కూల్‌ ఫీజులు, ఈఎంఐలు, బంధువుల ఫంక్షన్ల గురించే వారి సంభాషణ సాగుతుంది. ఇద్దరూ కలిసి ఇంటిని ఒక సంస్థలా అద్భుతంగా నడిపిస్తుంటారు కానీ, ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకోవడం మర్చిపోతారు.

హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని కవిత (38) అనుభవం ఇందుకు నిదర్శనం. ‘నాకు, మా ఆయనకు పెళ్లయి 12 ఏళ్లయింది. బయటి నుంచి చూసేవాళ్లకు మేం పర్ఫెక్ట్‌ కపుల్‌. కానీ నా మనసులో ఏం బాధ ఉందో, ఆఫీస్‌లో నేను ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నానో ఆయన అడగటం మానేసి ఏళ్లు గడుస్తోంది. ఇప్పుడు మేం భార్యాభర్తల కంటే ఇద్దరు రూమ్‌మేట్స్‌ లాగే బతుకుతున్నాం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఆర్థిక బాధ్యతలు, కెరీర్‌ ఒత్తిడిలో నలిగిపోతూ తెలియకుండానే భాగస్వామికి దూరమవుతున్న భర్తలూ ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన బ్యాంక్‌ మేనేజర్‌ కార్తీక్‌ (41) ‘నేను పొద్దున్నే ఆఫీస్‌కు వెళ్లి రాత్రి అలసిపోయి ఇంటికి వస్తాను. కుటుంబానికి ఏ లోటూ రాకూడదని కష్టపడుతున్నా కదా, అదే నా ప్రేమ అని అనుకున్నాను. కానీ ఆ క్రమంలో నా భార్యతో మనసు విప్పి మాట్లాడటమే మర్చిపోయాను. ఇప్పుడు ఇంట్లో ఇద్దరం ఉన్నా ఎవరిలోకంలో వాళ్లమే ఉంటున్నాం’ అని తన నిస్సహాయతను పంచుకున్నారు.

స్క్రీన్ల చాటున నిశ్శబ్దం!
పాత రోజుల్లో రాత్రి భోజనం తర్వాత భార్యాభర్తలు కబుర్లు చెప్పుకునేవారు. కానీ నేడు పడకగదిలోకి కూడా స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు చొరబడ్డాయి. పక్కపక్కనే కూర్చుని ఒకరు ఇన్ స్టాగ్రామ్‌ రీల్స్‌ చూస్తుంటే, మరొకరు యూట్యూబ్‌ వీడియోల్లో మునిగిపోతున్నారు. కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకునే క్షణాలు కనుమరుగై, వేలికొనల స్క్రోలింగ్‌ పెరిగిపోయింది. భాగస్వామి రోజంతా ఎలా గడిచిందో తెలుసుకోవాలనే కనీస ఆసక్తి నశించిపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణం.

మౌనం వీడితేనే మళ్లీ చిగురు
ఒకవేళ మీ దాంపత్యం కూడా ఇలాగే ‘ఆటోపైలట్‌’ మోడ్‌లో యాంత్రికంగా సాగుతోందని అనిపిస్తే, వెంటనే మేల్కోవాలి. ఏం చేయాలి?
→ లోలోపల కుమిలిపోకుండా ‘మన మధ్య కొంతకాలంగా దూరం పెరిగినట్లు అనిపిస్తోంది, మన బంధం ఎటు వెళ్తోందో ఒకసారి మాట్లాడుకుందామా?’ అని సున్నితంగా సంభాషణ మొదలుపెట్టండి.
→ నిందించే బదులు ‘నాకు కొంచెం ఒంటరిగా అనిపిస్తోంది.. వారానికి ఒక సాయంత్రం ఫోన్లు పక్కన పెట్టి మనం ఇద్దరమే బయటకు వెళ్లి మాట్లాడుకుందాం’ అని స్పష్టంగా అడగండి.
→ భాగస్వామి తమ అసంతృప్తిని వెళ్లగక్కినప్పుడు, వెంటనే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. వారి మాటల వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిశ్శబ్దం ఒక్కరోజులో కరిగిపోదు. దానికి ఎంతో ఓపిక, ఇద్దరి వైపు నుంచి నిరంతర ప్రయత్నం అవసరం. బంధాన్ని కాపాడుకోవాలని ఇద్దరూ బలంగా కోరుకుంటే, నిశ్శబ్దపు గోడలను బద్దలుకొట్టి మళ్లీ ఆత్మీయతను నింపుకోవడం అసాధ్యమేమీ కాదు.

‘పిల్లల కోసం’...
చాలామంది తల్లిదండ్రులు ‘మేం విడిపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, అందుకే ఇలాగే సర్దుకుపోతున్నాం‘ అని చెబుతుంటారు. కానీ, అమ్మానాన్నల మధ్య ఉన్న ఆ నిశ్శబ్దపు ఉద్రిక్తతను పిల్లలు ఇట్టే పసిగడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రేమకు వ్యతిరేక పదం కోపం కాదు, నిర్లిప్తత. భార్యాభర్తలు గొడవ పడుతున్నారంటే బంధాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఇంకా ఉందని అర్థం. కానీ ఫిర్యాదులు చేయడం కూడా ఆపేసి పూర్తి నిస్సహాయతలోకి వెళ్లిపోవడమే క్వైట్‌ క్విట్టింగ్‌. తల్లిదండ్రులు ప్రేమ లేకుండా కేవలం బాధ్యతల కోసం యాంత్రికంగా బతకడం చూస్తూ పెరిగే పిల్లలకు, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన దాంపత్యం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. అది వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది’ అంటున్నారు నిపుణులు.

– కె

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)