గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
నేటి అసురులపైనా నాటాలి శరం
Published on Sun, 11/08/2026 - 05:44
దీపావళి అంటే ప్రమిదల వెలుగు టపాసుల చప్పుళ్లు కాదు. అది మహిళా శక్తి తేజం. నరకాసుర వధలో కృష్ణుడు రథి అయితే... సారథి సత్యభామ. కాని నేటి సమాజంలో ఇంకా నరకాసురులు ఉండనే ఉన్నారు. వారిపై ప్రతి ఒక్క స్త్రీ సత్యభామలా పోరాడుతూనే ఉంది. వారి పీడ విరగడయ్యే వరకూ స్త్రీలకు దీపావళి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మొదట నరక చతుర్దశి. పక్కరోజు దీపావళి. మరి సందర్భం అలాంటిది. నరకాసురుడు చచ్చాడు. అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన రాక్షసుడు సత్యభామా సమేత కృష్ణుడి చేతిలో టపా కట్టాడు. అంతవరకూ అందరూ చీకట్లో ఉన్నారు. చీకటి అంటే ఏమిటి? భయంలో బతకడమే. భయం పోవడమే వెలుతురు. భయపెట్టడం అసుర లక్షణం. భయపడటం పిరికి లక్షణం. సత్యభామ భయపడలేదు.
విల్లు అందుకుంది. బాణం సంధించింది. నరకాసురుడి నషాళానికి గురి చూసి కొట్టింది. ఈ గురి కావాలి. ఈ ధైర్యం కావాలి. ఎప్పుడూ కావాలి. కాలం మారినా యుగాలు మారినా కానీ నేటికీ స్త్రీ ఉనికిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే నరకాసుర ప్రవృత్తులు అలానే ఉన్నాయి. వంటింటి గోడల నుంచి కార్పొరేట్ ఆఫీసుల బోర్డ్‌రూమ్‌ల వరకు స్త్రీలను వేధిస్తూనే ఉన్నాయి. ఈ నరకాసురులను చూసి నేటి స్త్రీలు పోరాడుతూ ఉన్నారు. గెలుస్తున్నారు. గెలుస్తూనే ఉంటారు.
→ విల్లంబు పట్టిన వీరనారి
నరకాసురుడు అందరికీ సినిమా చూపిస్తున్నాడు. ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. కృష్ణుడు కదలక తప్పలేదు. తోడు సత్యభామ కూడా వచ్చింది. భీకర యుద్ధం. కృష్ణుడు ఒక్క క్షణం సొమ్మసిల్లాడు. సత్యభామ ఉగ్రరూపం దాల్చింది. అయిపోయావురా అని ఒకవైపు రథాన్ని నియంత్రిస్తూనే మరోవైపు విల్లందుకుని శరవర్షం కురిపించింది.
లోకకల్యాణం కోసం భర్తకు అండగా నిలబడటమే కాకుండా అవసరమైతే తానే ఒక ఆయుధంగా మారి శత్రువును తుదముట్టించగలనని నిరూపించింది. అలాంటి విప్లవమూర్తి సత్యభామ. చెడుపై అలాంటి విప్లవం దీపావళి. స్త్రీ అంటే అందచందాలు మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసానికి శౌర్యానికి నిలువెత్తు రూపమనీ సత్యభామ దీపావళి సందేశం ఇస్తున్నారు. ఆ సందేశం మనం ఎప్పుడూ అందుకుంటూ ఉండాలి.
→ ఇప్పటి నరకాసురులు
ఇప్పుడు నరకాసురుడు లేకపోవచ్చు. కానీ వాడి అరాచక ప్రవృత్తి మాత్రం అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. కత్తులతో రంపాలతో యాసిడ్లతో తిరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈ ప్రవృత్తికి పుట్టిన నరకాసురులే. ఇల్లా, ఆఫీసా, రోడ్డా చూడకుండా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు నరకాసురులు. ప్రతిభ ఉన్నా వంటింటి గోడల మధ్యే ఆమె ఆశలను నలిపేసే మగ దురహంకారులు నరకాసురులు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం బయటకు అడుగుపెట్టినప్పుడు ఆమె క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే సంకుచిత మనస్తత్వాలు నరకాసురులు. ఈ ఆధునిక నరకాసురులు ఆయుధాలతో రారు. వివక్ష రూపంలో ప్రతిరోజూ స్త్రీలను వేధిస్తూనే ఉంటారు.
→ కొనసాగుతున్న యుద్ధం
అయితే సత్యభామ ఓడిపోలేదు. సత్యభామ అంశ ఉన్న ఏ స్త్రీ ఓడిపోదు. ΄÷ద్దున్నే లేచింది మొదలు పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకుంటూనే ఆఫీసుల్లో మగవారితో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబ రథాన్ని నడుపుతున్న ప్రతి ఇల్లాలు ఒక సత్యభామే. కష్టాలు ఎదురైనప్పుడు కన్నీళ్లు పెట్టుకుని కూర్చోకుండా, సమాజం విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న ప్రతి వర్కింగ్ ఉమెన్ ఒక సత్యభామే.
అన్యాయం జరిగినప్పుడు గొంతుకెత్తి, హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి అమ్మాయిలోనూ ఆనాటి సత్యభామ శౌర్యం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దొంగ ఐడిల చాటున చేసే ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న నేటి సత్యభామను అభినందించాలి. ఇలా తమ ఉనికిని కాపాడుకోవడానికి నేటి మహిళలు ప్రతిరోజూ నిశ్శబ్ద యుద్ధం చేస్తూనే ఉన్నారు.
దీపావళికి మట్టి ప్రమిదలను వెలిగించి, ఇళ్లను అలంకరిస్తే సరిపోదు. ప్రతి ఇంట్లో ఉన్న ‘స్త్రీ’ అనే వెలుగును గౌరవించడం నేర్చుకోవాలి. మహిళలకు కావాల్సింది ఇంట్లో పెట్టి పూజించడం కాదు. సమాజంలో స్వేచ్ఛగా, సురక్షితంగా బతికే హక్కు, గౌరవం. తమ ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం పోరాడుతున్న ఆధునిక సత్యభామలకు సమాజం, కుటుంబం అండగా నిలవాలి. మహిళల ఆత్మవిశ్వాసపు కేరింతలు మిన్నంటినప్పుడే దేశంలో అన్యాయపు చీకట్లు తొలగిపోయి నిజమైన దీపావళి వెలుగులు విరజిల్లుతాయి.
కె.
Tags : 1