అడవిని కాపాడే ఆడపులులు

Published on Fri, 10/16/2026 - 04:57

ఆ మహిళలను‘పులి వితంతువులు’ అని పిలుస్తుంటారు. పులుల దాడుల్లో భర్తను కోల్పోయిన మహిళలే ఈ టైగర్‌ విడోస్‌. వీరికి పులులపై ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు. వాటి రక్షణ కోసం, వాటిని రక్షిస్తున్న మడ అడవుల కోసం ఈ మహిళలు ‘మ్యాంగ్రోవ్‌ ఆర్మీ’గా అవతరించారు. తాజాగా... ‘మ్యాంగ్రోవ్‌ ఆర్మీ’గా ప్రసిద్ధి  పొందిన మహిళల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రస్తావించారు. తమ వ్యక్తిగత నష్టాలను పట్టించుకోకుండా మడ అడవులను పునరుద్ధరిస్తున్నారని ప్రశంసించారు...

ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల డెల్టా, వందకు పైగా పులులకు నిలయమైన పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ను కాపాడుతున్నారు ‘మ్యాంగ్రోవ్‌ ఆర్మీ’ మహిళలు. తమ గ్రామాలను తుఫానుల నుండి రక్షించుకోవడానికి, సున్నితమైన పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి నదీతీరాల వెంబడి మొక్కలు నాటుతున్నారు.

రక్షణ–ఉపాధి... సుందర్‌బన్స్‌లోని ఒక మారుమూల ద్వీపమైన లహిరిపూర్‌కు చెందిన 45 ఏళ్ల నమిత కయల్‌ భర్త పులి దాడిలో చనిపోయాడు. 
ఆమె వదిన అనిత భర్త కూడా పులి దాడిలోనే చనిపోయాడు. పులులు నివసించే అడవి నుండి తమ గ్రామాన్ని వేరు చేసే నది తీరాల వెంబడి మడ మొక్కలను నాటుతూ, ఈ ఇద్దరు ‘మ్యాంగ్రోవ్‌ ఆర్మీ’ తో కలిసి పనిచేస్తున్నారు. 

‘పులుల దాడిలో మేము మా భర్తలను కోల్పోయాము. మా కుటుంబంలో సంపాదించేది వాళ్లిద్దరే. బురదగా ఉండే నదీ తీరాల్లో మడ మొక్కలను నాటినందుకు మాకు బియ్యం, పప్పు, వంటనూనె, మసాలాలు ... మొదలైన నిత్యావసర వస్తువులు ఇస్తారు. కొన్నిసార్లు చీరలు, శానిటరీ నాప్‌కిన్‌లు, కూరగాయలను పండించడానికి విత్తనాలు, చెరువులలో పెంచడానికి చేపపిల్లలు, ఇళ్లలో పెంచుకోవడానికి కోళ్లు ఇస్తారు. పులుల దాడిలో భర్తను కోల్పోయిన మాలాంటి వారు మ్యాంగ్రోవ్‌ ఆర్మీలో చాలామంది ఉన్నారు’ అంటుంది నమిత.

ఒకే తాటిపై... ఐలా తుఫాను వల్ల సుందర్‌బన్స్‌కు తీవ్రనష్టం వాటిల్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఉమాశంకర్‌ మండల్‌ ‘మ్యాంగ్రోవర్‌ ఆర్మీ’ని ్రపారంభించారు. నదీతీరాల్లో మడ మొక్కలను నాటడానికి 200 మంది మహిళలను ఒకేచోటుకి చేర్చారు. కాలక్రమంలో ఈ 200 మంది కాస్తా 600 మంది అయ్యారు. పాతికేళ్ల వయసు నుండి అరవై ఏళ్లలోపు మహిళలు ప్రతి ఏటా వేలకొద్ది మొక్కలను నాటడానికి నదీతీరాల్లో మోకాలి లోతు బురదలో నడుస్తూ పనిచేస్తున్నారు.

క్రౌడ్‌ ఫండింగ్‌తో... ‘ప్రతి మెంబర్‌కు నిర్దిష్టమైన ప్రాంతాన్ని కేటాయిస్తారు. వారు కనీసం మూడేళ్లపాటు వంద మడ చెట్ల సంరక్షణ బాధ్యతలను చూస్తారు. మూడేళ్ల తరువాత ఈ ప్రాంతాలు దట్టమైన మొక్కలతో కళకళలాడుతుంటాయి’ అంటుంది సత్జేలియా ద్వీపానికి చెందిన స్వప్న మిస్త్రీ. మ్యాంగ్రోవ్‌ మొక్కల కోసం ఆర్మీ మహిళలు చిన్న, చిన్న నర్సరీలను కూడా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలకు ఈ మొక్కలను అమ్ముతారు. ఈ చిన్నపాటి ఆదాయంతో పాటు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించారు.

‘సట్జేలియా, కుమిర్‌మారి, చొటొ మొల్లా ఖాలీ వంటి పన్నెండు మారుమూల దీవుల నదీతీరాల్లో పదమూడు లక్షలకు పైగా మడ అడవి మొక్కలను నాటాం. మీడియా దృష్టికి రాకుండా నిశ్శబ్దంగా పనిచేశాం. మహిళా బృందానికి అధికారికంగా మ్యాంగ్రోవ్‌ ఆర్మీ అని పేరు పెట్టాం’ అన్నారు పుర్బాషా ఎకో–హెల్ప్‌లైన్‌ సొసైటీ  స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఉమాశంకర్‌ మండల్‌.

ప్రధాని ప్రశంస... ‘పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో ప్రకృతితో మనుషులకు ఉండే ప్రత్యేక అనుబంధానికి ఈ మహిళలు నిదర్శనం. వీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ మహిళల్లో చాలామంది భర్తలు పులుల దాడుల్లో భర్తను కోల్పోయారు. భర్తను కోల్పోయిన తరువాత సుందర్‌బన్స్‌ నుండే వారికి ఆదరణ లభిస్తోంది. వారు నాటిన మొక్కలు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా నిలిచాయి. అడవులను రక్షించడం ద్వారా ఉపాధి కూడా  పొందుతున్నారు’ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ‘మ్యాంగ్రోవ్‌ ఆర్మీ’ని ఉద్దేశించి. ‘ప్రధానమంత్రి స్వయంగా మా పనిని మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా కష్టానికి దక్కిన గుర్తింపు’ అంటుంది నమిత.

సహజ రక్షణ కవచం
సుందర్‌బన్స్‌లో సుమారు 102 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో 52 ద్వీపాలలో మాత్రమే జనావాసం ఉంది. మిగిలిన ద్వీపాలు జాతీయ పార్క్‌లు, పులుల సంరక్షణ కేంద్రాలుగా ఉన్నాయి. వన్య్రపాణులకు అభయారణ్యాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. మడ అడవులు తుఫానులకు సహజ అడ్డంకిగా పనిచేస్తాయి. తీర ప్రాంతంలోని నివాసాలను తుఫాను ఉప్పెనలు, బలమైన గాలుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. జీవనోపాధి కోసం అడవిలోకి వెళ్లే ప్రజలకు పులల నుంచి ముప్పు ఉంది. అయితే గత కొనేళ్లుగా పులుల దాడుల్లో మరణాలు తగ్గాయని ఫారెస్ట్‌ సర్వే ఇండియా(ఎఫ్‌ఎస్‌ఐ) గణంకాలు తెలియజేస్తున్నాయి. 2018లో పులుల దాడుల వల్ల పదిహేనుమంది మరణించగా, 2023లో మాత్రం ఒక్కరూ మరణించలేదు. 2024లో మాత్రం ఒక మరణం నమోదైంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)