వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
ఇక కార్ల మైలేజీ రయ్!
Published on Thu, 10/01/2026 - 03:52
న్యూఢిల్లీ: శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకుంటూ, పర్యావరణహితమైన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు తదితర ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మైలేజీ నిబంధనలను ప్రకటించింది. మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్–3) రూల్స్‌ని కేంద్ర విద్యుత్ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
వీటి ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో కార్ల కంపెనీలు తాము విక్రయించే మొత్తం వాహనాల సగటు మైలేజీని దాదాపు 16.7 శాతం మేర మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. 2025 ముసాయిదా ప్రతిపాదనలతో పోలిస్తే.. భారీ వాహనాలకన్నా, తేలికపాటి వాహనాలకు మైలేజీ లక్ష్యాల్లో కాస్త సడలింపునివ్వడంతో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు సగటు మైలేజీ లక్ష్యాల విషయంలో మరికాస్త అదనపు వెసులుబాటు ఉంటుంది.
మరిన్ని కీలకాంశాలు..
2027–28లో 100 కి.మీ.కు 3.996 లీటర్లుగా నిర్దేశించిన సగటు ఇంధన వినియోగం క్రమంగా 2031–32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిన్న, పెద్ద కార్ల వర్గీకరణకు సంబంధించి రిఫరెన్స్ వెయిట్ (బరువు) ను 1,082 కేజీల నుంచి 1,229 కేజీలకు పెంచారు.
ఇంధనాన్ని ఆదా చేసే, గుర్తింపు పొందిన టెక్నాలజీల పరిధిని నాలుగు నుంచి పన్నెండుకు పంచారు. స్టార్ట్–స్టాప్ సిస్టమ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మైక్రో–హైబ్రిడ్ సిస్టమ్‌లు, ఎలక్ట్రిక్ వాటర్ పంపులు మొదలైన టెక్నాలజీలకు చోటు కల్పించారు. దీనితో లక్ష్యాల సాధనలో తయారీ సంస్థలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఈ సాంకేతికతలతో వాహనాలు తయారు చేసే సంస్థలు ప్రతి కిలోమీటరుకు 1 గ్రాము మేర కర్బన ఉద్గారాల తగ్గింపును కంపెనీలు క్లెయిమ్ చేసుకోవచ్చు.
శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇథనాల్‌లాంటి పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించడం ఈ నిబంధనల లక్ష్యం. పర్యావరణహితమైన, అధునాతన సాంకేతికతలను వేగంగా ప్రవేశపెట్టేందుకు అదనపు ప్రోత్సాహకాలుంటాయి.
భారత్‌లో తయారు చేసిన వాహనాలకు, ఇక్కడ విక్రయించేందుకు దిగుమతి చేసుకున్న వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
Tags : 1