వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
పెద్దలను చిన్నబుచ్చవద్దు!
Published on Thu, 10/01/2026 - 00:49
‘అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు’ అనేది కాలం చెల్లిన సామెత అయితే బావుండేది. దురదృష్టవశాత్తు... ఇది నిత్యనూతన సామెత అయింది. ‘ముసలి తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కుమారులు’ ‘పట్టించుకునే దిక్కులేక ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు’... ఇలాంటి వార్తలు రోజూ వింటూనే ఉంటాం. ‘వృద్ధాప్యం’ అంటే ఒంటరితనం కాదు. ‘నా కొడుకు... నా బిడ్డ... వారి పిల్లలు...ఇది నా సైన్యం’ అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే కాలం. సైన్యం అనుకున్నవాళ్లే చిన్నచూపు చూస్తే... వృద్ధాప్యం శాపం అవుతుంది...
తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఊరు...
సోమయ్య, నర్సమ్మ దంపతులకు నలుగురు కమారులు. పిల్లలను బాగా కష్టపడి చదివించారు. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మరో ఇద్దరు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు.
కొన్ని సంవత్సరాల తరువాత...
క్యాన్సర్ బారిన పడి సోమయ్య భార్య చనిపోయింది. నలుగురు కుమారులు వివిధ నగరాల్లో స్థిరపడడంతో ఊళ్లో సోమయ్య ఒంటరి వాడు అయ్యాడు. వయసు పైబడడంతో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక పోయేవాడు. విషయం నలుగురు కుమారులకు తెలిసింది. ‘పెద్దాయనను ఇలా ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు.
మీ దగ్గరే ఉంటే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు ఊరి వాళ్లు. అప్పటికైతే ‘సరే’ అన్నారు నలుగురు కుమారులు. ఆ తరువాత అన్నదమ్ముల మధ్య తగాదాలు మొదలయ్యాయి.ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సోమయ్యను పట్టించుకునే దిక్కులేదు. తన ముందే కుమారులు గొడవ పడడం సోమయ్య హృదయాన్ని గాయపరిచింది. ఒకరోజు రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
....ఇది ఒక రాష్ట్రం సమస్య కాదు. ఒక ప్రాంతం, ఒక ఊరు సమస్య కాదు. అన్ని రాష్ట్రాలలో, ఎన్నో ఇళ్లలో ఇలాంటి బాధితులు కనిపిస్తారు.
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాదు. ఆత్మీయ బంధాలు’ అనుకునే రోజులు రావాలి. అపురూపమైన బాంధవ్యాలు వికసించే రోజులు రావాలి.
జ్ఞానులు... గౌరవనీయులు
→ భారతదేశంలోని యువత, వృద్ధులను ‘ఒంటరివారు’ ‘ఇతరులపై ఆధారపడేవారు’గా భావిస్తున్నారని, అదే సమయంలో ‘జ్ఞానులు’ ‘గౌరవనీయులు’గా భావిస్తున్నారని హెల్ప్ ఏజ్ ఇండియా నివేదిక తెలియజేసింది.
→ వృద్ధులను వేధిస్తున్న కేసులు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
→ 82 శాతం మంది సీనియర్ సిటిజనులు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. 35 శాతం మంది తమ కుమారుల చేతిలో వేధింపులకు గురవుతున్నారు.
→ వేధింపులకు పాల్పడుతున్న వారు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులే కాబట్టి పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వృద్ధులు సంకోచిస్తున్నారు. ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్రాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి.
Tags : 1