వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
‘అలా ఎవరు చెప్పినా... అవార్డులొస్తాయి!’
Published on Sat, 09/26/2026 - 21:37
తాజా నేషనల్ అవార్డుల సంబరం ముగిసింది. అవార్డుల విజేతల ఎల్లలెరుగని ఆనందం మాత్రం కొనసాగుతోంది. పర్యాటకానికీ, సినీ ప్రచారానికీ లంకె వేసి, ఇకపై ఏడాదికో చోట అవార్డుల ప్రదానం చేస్తామన్న కేంద్రప్రభుత్వ ప్రకటనపైనా జోరుగా చర్చ జరుగుతోంది. వీటన్నిటి మధ్య గత మూడేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 72వ జాతీయ అవార్డుల (2024)లో తెలుగు సినిమా తొమ్మిది అవార్డులు గెలవడం సినీ ప్రియులకు మరపురాని విశేషమైంది.
తాజా అవార్డులతో కలిపి ఇప్పటికి 4 సార్లు జాతీయ అవార్డుల జ్యూరీలో ఉన్న ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య. ‘మనసంతా నువ్వే’ (2001), ‘నేనున్నాను’ (2004) లాంటి హిట్ చిత్రాల నిర్దేశకుడైన ఆయన ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు అధ్యక్ష పదవిలో ఉన్నారు. హైదరాబాద్ సెన్సార్ బోర్డ్ సభ్యత్వం నుంచి వివిధ జాతీయ, రాష్ట్ర అవార్డు జ్యూరీలలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం.
తాజా నేషనల్ అవార్డుల ప్రదానంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాదు... తుది జ్యూరీలోనూ అన్ని భాషల వారికీ తలలో నాలుక ఆదిత్య అన్న సంగతి గుజరాత్ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ సాక్షిగా అడుగడుగునా కనిపించింది. తెలుగు సినిమాకు ఇటీవల పెరిగిన అవార్డుల సంఖ్యలోనూ ఆయనదే పాత్ర అని పరిశ్రమలో ఓ టాక్. ఆ మాటే అడుగుతూ, గుజరాత్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యే వేళ... సాక్షి ఆయనతో జరిపిన ప్రత్యేక భేటీ ఇది. ముఖ్యాంశాలు...
ప్రశ్న: ప్రతిసారీ మీరు జ్యూరీలో ఉన్నప్పుడే తెలుగు సినిమాకు ఎక్కువ అవార్డులు వస్తున్నట్టున్నాయి. అందరూ అదే అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారేమిటి?
జవాబు: (నవ్వేస్తూ...) అదేమీ లేదండీ! మన సినిమాల్లో, నటీనటులు, టెక్నీషియన్లలో ప్రతిభ ఉంది కాబట్టే అవార్డులు వస్తున్నాయి. కాకపోతే, ఎంట్రీలుగా వచ్చిన సినిమాల్లోని ఆ ప్రతిభను జ్యూరీ సమావేశాల్లో సరిగ్గా వివరించి చెప్పడం చాలా కీలకం. మన సంస్కృతి, మన భాష, మన సినిమా... భారతీయ సినిమా స్థాయిలో ఎంత గొప్పగా ఉన్నాయో చెప్పగలగడం వల్లే అవార్డుల పంట పండుతోంది. జ్యూరీ సభ్యుడిగా ఉన్నప్పుడల్లా నేను చేస్తున్నది ఆ పనే! బహుశా, అందుకే నేను జ్యూరీలో ఉన్నప్పుడు తెలుగు సినిమాకు సంఖ్యాపరంగా ఎక్కువ అవార్డులు వస్తూ ఉండి ఉండవచ్చు. నేను కాకపోయినా ఎవరున్నా... జ్యూరీలోని మెజారిటీ సభ్యులకు అంగీకారయోగ్యంగా ఉండేలా చెప్పగలిగితే చాలు. అలా ఎవరు చెప్పినా అవార్డులు వస్తాయి.
ప్ర: మీ లానే మిగతా భాషల జ్యూరీ సభ్యులూ ఉంటారు. వారూ తమ తమ భాషల సినిమాల పక్షాన వాదిస్తారుగా?
జ: ఉంటారు. వాదిస్తారు. మొత్తం 11 మంది ఫైనల్ జ్యూరీలో కనీసం 8 మంది మన వాదనతో అంగీకరించేలా చేయగలిగితే మన సినిమాకు అవార్డు వస్తుంది. (నవ్వుతూ...) ఆ సందర్భంలోనే చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజీ స్థాయిలో నేను పాల్గొన్న చర్చలు, వక్తృత్వపు పోటీల అనుభవం, వాదనా పటిమతో మన పాయింట్‌కు అనుకూలంగా జడ్జీలను కన్విన్స్ చేసిన నేర్పు నాకు ఇక్కడ పనికొస్తున్నాయి.
ప్ర: నేషనల్ అవార్డుల తుది వడపోత దశకు చేరుకున్న సినిమాలంటే ప్రతిభలో పోటాపోటీగానే ఉంటాయిగా? కన్విన్స్ చేయడం ఈజీ కాదుగా?
జ: నిజమే. నేషనల్ అవార్డుల్లో ప్రాథమిక వడపోతలన్నీ దాటుకొని, తుది వడపోత దశలో సెంట్రల్ జ్యూరీకి వచ్చే సినిమాలన్నీ కాస్త అటూ ఇటూగా సమానమైన ప్రతిభాపాటవాలతో ఉంటాయి. వాటిని జడ్జ్ చేయడమూ కష్టమే. వాటిలో మన భాషలోని సినిమా ఎందుకు మెరుగైనదో విశ్లేషణాత్మకంగా, పాయింట్ల వారీగా చెప్పి ఒప్పించగలగాలి. అదే కష్టం. ఉదాహరణకు కరోనా సమయంలో సింగిల్ క్యారెక్టర్ సినిమాలు, లాక్డౌన్లో ఇరుక్కుపోయిన వ్యక్తుల కథలతోనే వేర్వేరు భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటప్పుడు ఆ కథ, దాన్ని తెరపై చూపిన కథన విధానం ఇవన్నీ కీలకమవుతాయి. ఆ సంగతి చెప్పి, మిగతా జ్యూరీ సభ్యులను కూడా ఒప్పించాలి. అప్పుడే మెజారిటీ అభిప్రాయంతో అవార్డు దక్కుతుంది. ఇందాకే అన్నట్టు కాలేజీ రోజుల నుంచి డిబేట్లలో నా వాదన చెప్పి, ఒప్పించడం నాకు అలవాటున్న విషయమే. (నవ్వులు).

ప్ర: అయితే, ఢిల్లీలో తెలుగు జెండా ఎగరేస్తున్నానంటారు?
జ: (మళ్ళీ నవ్వేస్తూ...) ఎగరేస్తున్నా కాదు... ఎగరేస్తున్నాం! దేశ రాజధానిలో తెలుగోడి జెండా ఎగరేస్తేనే కదా గొప్ప విషయం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే... నేను 68వ జాతీయ అవార్డుల (2020)కు ఫీచర్ ఫిల్ముల విషయంలో తుది నిర్ణయం తీసుకొనే సెంట్రల్ ప్యానెల్లో ఉన్నాను. ఆసారి తెలుగు సినిమాకు ‘అల వైకుంఠపురములో’ సినిమా సంగీతానికి తమన్‌తో సహా 4 నేషనల్ అవార్డులు వచ్చాయి. వెంటనే 69వ జాతీయ అవార్డుల (2021)కు కూడా ఫీచర్ ఫిల్ముల సెంట్రల్ ప్యానెల్లో ఉన్నాను.
అప్పుడే ‘ఆర్.ఆర్.ఆర్’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్, ‘పుష్ప-1’లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడుతో సహా 11 అవార్డులు తెలుగు సినిమాకు వచ్చాయి. ఇక, 70వ జాతీయ అవార్డుల (2022)లో నేను జ్యూరీలో లేను. తెలుగు సినిమాకు ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఒక్కటే వచ్చింది. 71వ జాతీయ అవార్డుల (2023)కు మళ్ళీ సెంట్రల్ ప్యానెల్ సభ్యుడిగా తీసుకున్నారు.
ఆసారి తెలుగుకు 8 నేషనల్ అవార్డులొచ్చాయి. తాజా 72వ జాతీయ అవార్డుల (2024)కు కూడా సెంట్రల్ ప్యానెల్ సభ్యుడినే. ఈసారి 9 అవార్డులొచ్చాయి. ఇదేదో నేను జ్యూరీలో ఉన్నందువల్ల వచ్చాయని చెప్పడం కోసం కాదు. అటు ఆలోచనా విధానంలో కానీ, ఇటు మేకింగ్‌లో కానీ మన సినిమాల తాలూకు నాణ్యత జాతీయ స్థాయిలో ఉందని గుర్తు చేయడమే నా ఉద్దేశం. ఆ యా సినిమాల పక్షాన లాజికల్‌గా, కన్విన్సింగ్‌గా వాదన వినిపించే నిపుణులు సభ్యులుగా ఉంటేనే అవార్డులు వస్తాయన్నదే నా అభిప్రాయం.
ప్ర: మన సినిమా మేకింగ్ మారింది సరే... ఆలోచనా విధానం అంతగా మారిందంటారా?
జ: కచ్చితంగా మారింది. ఒకప్పటి లాగా వెండితెరపై హింస బాగా ఆడుతోందంటే... హింసే తీయడం, సెక్స్ ఆడుతోందంటే ఆ తరహా సినిమాలే తీయడం లాంటి మూస ధోరణి ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక భావోద్వేగమైన కథ తెరపై చూపాలనుకుంటున్నారు. అందుకే, మనం వేరే వేరే కథలు తీయగలుగుతున్నాం. అంతే కాదు... కోవిడ్ తర్వాత ప్రాంతీయ సినిమా, ప్రాంతీయ ప్రేక్షక వర్గం అనేవి పోయి, ప్యాన్ – ఇండియా సినిమాలు తీస్తున్నాం. అలా విస్తృత ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం వల్ల, లార్జర్ ఆడియన్స్ ఆ సినిమా ఆల్రెడీ చూసి ఉంటారు. వేర్వేరు భాషల వాళ్ళకు కూడా దాని విలువ తెలుస్తుంది. తద్వారా అవార్డుల ఎంపిక దశలో మన సినిమాకు మొగ్గు సులభం అవుతుంది.
ప్ర: కానీ, తెలుగు సినిమాకు ‘ప్యాన్ ఇండియా సినిమా’ పిచ్చి పట్టిందని ఓ విమర్శ!
జ: అలా అనుకోవడానికి లేదు. జనరల్‌గా ఒక వస్తువుకు, ఇక్కడంటే... సినిమాకు మార్కెట్ ఇంత ఉందని తెలిశాక, ఎవరైనా ఆ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొనే సినిమా తీస్తారు. అంతే తప్ప తగ్గించుకోవాలని చూడరు. అందుకే, ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టితో సినిమాలు తీస్తున్నారు. ప్రయత్నమైతే... అందరినీ ఆకట్టుకొని, నాలుగు డబ్బులు చేసుకోవాలనే! ఈ ప్యాన్ ఇండియా దృష్టి వల్ల మనం ఎంచుకొనే కథ మారుతుంది. దేశంలోని అన్ని భాషలు, వర్గాల వారికీ మన సినిమా చేరుతుంది. ఇందాకే చెప్పినట్టు తద్వారా జాతీయ అవార్డులకు పోటీలో మన పని సులభం అవుతుంది.
ప్ర: ‘ప్యాన్ ఇండియా’ రంధిలో పడి... తెలుగు సినిమా మూలాల్ని మరిచి, నేల విడిచి సాము చేస్తోందేమో!
జ: ఆ వాదనను నేను అంగీకరించను. మనవైన కథలు మనం చెబుతున్నాం. ‘మిరాయ్’, ‘కార్తికేయ’ లాంటివి మన కథలే. నాని ‘దసరా’ లాంటివైతే ఇంకా డీప్ రూటెడ్ ఫిల్మ్స్. అయినా, సినిమా ఓ కళే కానీ, అది వ్యాపారం కూడా! కాబట్టి, దేనికి మార్కెట్ ఉంటే అదే తీస్తారు ఇక్కడ! మొబైల్ ఫిల్మ్స్‌కి మార్కెట్ ఉంటే మొబైల్ ఫిల్మ్స్... టీవీ ఫిల్మ్స్‌కు ఉంటే టీవీ ఫిల్మ్స్... ప్యాన్ ఇండియా ఫిల్మ్స్‌కు మార్కెట్ ఉంటే పాన్ ఇండియా ఫిల్మ్స్. అంతే... సింపుల్! అంతెందుకు... తాజాగా రాష్ట్ర అవార్డులు, నేషనల్ అవార్డులు వచ్చిన ‘35... చిన్న కథ కాదు’ అనేది ఒక ఆమిర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ లాంటి సినిమా. ఆ కథతో తెలుగు వాళ్ళ నుంచి ఉత్తరాది వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు.
అలాగే, ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. అది తెలుగు సినిమాయే అయినా, ఆ గ్రామ రాజకీయాలు, కులాల వ్యవహారం లాంటివి తమిళం, మలయాళం... అన్నిచోట్లా కామనే! అందుకే, జాతీయ స్థాయిలో ఆ సినిమాకు గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఆ సరికొత్త ఆలోచనా విధానం నిండిన కథలు, కథనాలతో కొత్త తరం రచయితలు, దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. అందుకే, తెలుగు సినిమా ఈసారి 9 నేషనల్ అవార్డులు సాధించగలిగింది.
ప్ర: అవార్డుల జ్యూరీలో పనిచేయడం మీకు కొత్త కాదు కానీ, తాజా జ్యూరీలో అనుభవం ఎలా ఉంది?
జ: తాజా 72వ నేషనల్ అవార్డుల్లో ఫీచర్ ఫిల్ముల విభాగానికి సంబంధించి... రీజనల్ సౌత్ ప్యానెల్లో మన తెలుగువాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు - అనేక ప్రసిద్ధ, ప్రభుత్వ చలనచిత్రోత్సవాలకు పనిచేసిన ఎం.ఎస్. ప్రసాద్ గారు. మరొకరు... నటి – కూచిపూడి నర్తకి ప్రశాంతి హారతి గారు. ఇక, ఫైనల్ సెంట్రల్ ప్యానెల్లో మాత్రం తెలుగు వాణ్ణి నేనొక్కడినే! మా సెంట్రల్ ప్యానెల్‌కు సుప్రసిద్ధ మలయాళ దర్శకుడు పి. జయరాజ్ ఛైర్మన్. ఆయన 8 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రతిభావంతుడు. ఆయన ఇప్పటికీ రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్నారు గనక సమకాలీన అంశాలు, పరిస్థితులు, వర్తమాన ధోరణులు ఆయనకు బాగా తెలుసు. ఆయన ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించారు. జ్యూరీలోని వివిధ భాషలు, ప్రాంతాలకు చెందినవారందరితో ఆయన బాగా కలిసిపోయారు. అందరినీ సమానంగా చూశారు. ఎక్కడా ఉత్తరాది, దక్షిణాది లాంటి పొరపొచ్చాలు ఏమీ లేకుండా, అందరినీ ఏకతాటిపై నడిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూనే, ప్రతిభకు పట్టం కట్టేలా అవార్డుల నిర్ణయం చేశారు. అది చాలా గొప్ప విషయం.
ప్ర: అవార్డుల తుది ఎంపిక నిర్ణయం ఎంత కష్టమైంది?
జ: చూడండి. ఈసారి దేశం నలుమూలల నుంచి, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలే కాకుండా, పొందని భాషల నుంచి కూడా కలిపితే దాదాపు 500కు పైగా ఫీచర్ ఫిల్ములు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిలో నుంచి రీజనల్ జ్యూరీలు వడ కట్టి, ఎంపిక చేసిన కొన్నింటినే ఫైనల్ సెంట్రల్ జ్యూరీకి పంపుతారు. అలాగే పంపారు. దాంతో, ఫైనల్స్‌కు వచ్చేవన్నీ నాణ్యమైన సినిమాలే. వాటి మధ్య పెద్ద ఫైట్ ఉంటుంది. ఈసారీ ఉంది. మన తెలుగు నుంచి తుది దశకు వచ్చినవే... ‘కల్కి-1’, ‘పుష్ప-2’, ‘35... చిన్న కథ కాదు’, ‘కమిటీ కుర్రోళ్ళు’, ‘లక్కీభాస్కర్’. ఆ దశకు వచ్చినదేదీ ఉత్త చేతులతో ఇంటికి రాలేదు. 5 సినిమాలకూ కలిపి 9 అవార్డులు వచ్చాయి.
గతంలో ఒకసారి అయితే, తెలుగు నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘పుష్ప-1’, ‘కొండపొలం’, ‘ఉప్పెన’... ఇలా దాదాపు ఆరేడు సినిమాలు ఒకే ఏడాది పోటీ పడ్డాయి. ఆ ఏడాదే మనకు 11 అవార్డులు వచ్చాయి. మరోసారి, ‘బలగం’, ‘బేబీ’, ‘భగవంత్ కేసరి’, ‘హను-మాన్’ వగైరా పోటీకి వచ్చాయి. వాటికీ అవార్డులు దక్కాయి. అందుకే, జ్యూరీలో మన ప్రాంతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించేవాడు బలంగా ఉండాలని నేను పదే పదే చెబుతుంటాను.
ప్ర: కానీ, జ్యూరీలో సభ్యుడంటే నిష్పాక్షికంగా ఉండాలి కదా! ఎవరికి వారు వాళ్ళ భాష, ప్రాంతం పట్ల పక్షపాతం చూపిస్తే ఇంకేముంది?
జ: చూడండి. అన్నిటినీ చూసి, నిష్పాక్షికంగానే నిర్ణయం చెప్పాలి. చెబుతాం. నా డిబేట్ కేవలం తెలుగు సినిమాకి అనే కాదు. అవార్డు ఇవ్వదగ్గ మంచి సినిమాకి! నేను తెలుగు కోసం ఎంత కొట్లాడానో, అంతే సమానంగా తమిళం, మలయాళం, గుజరాతీ, హిందీ, అస్సామీస్ చిత్రాల గురించి కొట్లాడిన సందర్భాలు అనేకం. ఇతర భాషల వాళ్ళు తడబడితే, వాళ్ళ పక్షాన నిలబడి అవార్డు ఎందుకు ఇవ్వవచ్చో పాయింట్లు చెప్పి, నా అభిప్రాయంతో వాళ్ళకు అవార్డులు దక్కిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ వేదిక మీద... మన పర్సనల్ అజెండాలు, ప్రిజుడిస్లు ఉండకూడదు, ఉండవు. ఉంటే కష్టం. ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో జరిగే అనేక సంఘటనల వల్ల చాలామందికి నేను పడకపోవచ్చు. అలాగే నాకు కొందరు ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళ సినిమాలే అక్కడ ఉండవచ్చు. కానీ, జ్యూరీలో ఉన్న తర్వాత అవన్నీ మర్చిపోయి, సినిమాకు ఏది మంచిదన్నదే చూడాలి. యోగా చేసినట్టుగా మనం పనిచేయాలి.

ప్ర: ఈ మధ్య అవార్డే టార్గెట్‌గా సినిమా తీయడం, సినిమా రిలీజైనప్పటి నుంచి ఫలానా అవార్డ్ ఖాయమంటూ ప్రచారం చేసుకోవడమూ జరుగుతోంది కదా!?
జ: ఎప్పుడైనా... నేషనల్ అవార్డుల పర్స్పెక్టివ్లో సినిమా ఉండాలి. అంతేతప్ప, సినిమా తీసేవాడి పర్స్పెక్టివ్లో నేషనల్ అవార్డ్ ఉండకూడదు. నాకు తెలిసి ఎవరూ అలా నేషనల్ అవార్డుల కోసం సినిమాలు తీసేవారు ఉండరు. ఇక, ముందస్తుగా చెప్పుకోవడం అంటారా... సినిమా వ్యాపారంలో అదో రకం పబ్లిసిటీ. అంతే! అయితే, వాళ్ళు కూడా ఆస్కార్ అవార్డు అనరు... నేషనల్ అవార్డ్ అనే అంటారు. ఎందుకంటే, మనం నేషనల్ అవార్డ్ వస్తుందంటే... నమ్ముతాం! అదే గనక ఆస్కార్ అవార్డ్ వస్తుందంటే... నవ్వుతాం!!
ప్ర: గుజరాత్‌లోని కేవడియాలో ఈసారి నేషనల్ అవార్డుల ప్రదానం చూశాక మీకు ఏమనిపించింది!?
జ: ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకీ థ్యాంక్స్ అంటే... ఇవాళ ప్రభుత్వం మంచి సినిమాను, మంచి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అవార్డుల పేరిట ఇంత శ్రమ పడుతున్నారు. ఇంత ఖర్చు పెడుతున్నారు. సినిమా మీద వాళ్ళకు వచ్చేదేమీ పెద్దగా లేదు. అయినా ఇవన్నీ చేస్తున్నారు.
ప్ర: ఎన్నికల షెడ్యూల్ వగైరా దృష్టిలో పెట్టుకొని, వాటిని కూడా రాజకీయ ప్రయోజనాలకై వాడతారని కొందరి విమర్శ?
జ: నేను అది ఒప్పుకోను. దక్షిణాదిలో ప్రభుత్వం కానీ, ప్రయోజనం కానీ లేకపోయినా, దక్షిణాదికి అవార్డులు ఇస్తూనే వచ్చారు, ఇస్తారు. ఇంకా చెప్పాలంటే, అవార్డుల విషయంలో ప్రభుత్వ జోక్యం కానీ, వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి కానీ ఏమీ లేవు. అయినా, ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా రంధ్రాన్వేషణ చేసి, రాజకీయపరంగానే చూస్తుంటాం. అది మనకు ఆది నుంచీ అలవాటు.
ప్ర: ఢిల్లీ దాటి నేషనల్ అవార్డులు బయట జరగడం ఇది ముచ్చటగా మూడోసారి. ఇకపై ఏడాదికో చోట నేషనల్ అవార్డుల ప్రదానం చేస్తామని ప్రకటించారు. అది చాలా ఖర్చు, శ్రమ అవుతుందని కూడా మరో విమర్శ. దానిపై మీ కామెంట్!?
జ: అది వాళ్ళకు శ్రమ, ఖర్చే కానీ... చూసేవాళ్ళకు ఏముంది! నాకైతే బాగుంది. దేశంలోని వేర్వేరు ప్రదేశాలలో అవార్డుల ప్రదానం జరగడం వల్ల అక్కడి భాష, సంస్కృతి సహా పర్యాటక ప్రదేశాలు అందరికీ తెలుస్తాయి. (నవ్వుతూ...) పైగా, మన లాంటి వాళ్ళం కూడా వేర్వేరు ప్రదేశాలు చూడవచ్చు కదా! కాబట్టి, రేపు అండమాన్‌లో అవార్డుల ప్రదానం పెట్టి రమ్మన్నా, నేను వెళతా. సినిమా వాళ్ళందరూ వస్తారు. - ఆర్. జయ
Tags : 1