వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య!
Published on Sat, 09/26/2026 - 06:05
ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలో కూడా అంతర్గతంగా ఊపిరితిత్తుల వ్యాధులు ఉండే అవకాశాలు అధికంగానే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులకు విశేషమైన పని సామర్థ్యం (రిజర్వ్ కెపాసిటీ వల్ల) ఉండటం వల్ల, వ్యాధి ప్రారంభ దశల్లో లక్షణాలు కన్పించవని, శరీరం కూడా ఆ పరిస్థితిని తట్టుకుంటుందని అంటున్నారు. కాబట్టి ఒకరు శారీరకంగా దృఢంగా ఉన్నట్లు కనిపించినంత మాత్రాన వారి ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్:
మరి ముందస్తుగా ఎలా గుర్తించాలి?
⇒ బయటి రూపాన్ని బట్టి కాకుండా, శ్వాసక్రియలో వచ్చే వివిధ మార్పుల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
⇒ వ్యాయామ సామర్థ్యం తగ్గుదల...గతంలో సులభంగా చేసిన పనులు (ఉదాహరణకు నడక, రన్నింగ్, మెట్లు ఎక్కడం) ఇప్పుడు చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోవడం లేదా ఊపిరి అందకపోవడం
⇒ వదలకుండా వేధించే దగ్గు... ఎటువంటి జలుబు, జ్వరం లేకపోయినా 3–4 వారాల కంటే ఎక్కువ కాలం పాటు దగ్గు ఉండటం
⇒ కఫం రావడం.. ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతరం కఫం బయటకు రావడం (ముఖ్యంగా రంగు మారినట్లయితే)
⇒ శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం (వీజింగ్)...గాలి పీల్చేటప్పుడు లేదా వదిలేటప్పుడు గురక లాంటి లేదా ఈల వేసినట్లు శబ్దం రావడం
⇒ ఛాతీలో నొప్పి లేదా బిగుతు.. శ్వాస తీసుకునే సమయంలో ఛాతీ భాగంలో అసౌకర్యంగా లేదా బరువుగా అనిపించడం
తీసుకోవాల్సిన రక్షణ చర్యలు
⇒ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి.
⇒ ధూమపానం (సిగరెట్లు, బీడీలు తాగడం) పూర్తిగా మానేయాలి. ఇతరులు వదిలిన పొగ పీల్చకుండా జాగ్రత్త పడాలి
⇒ బయటకు వెళ్లే ముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక)ను పరిశీలించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా మాస్క్ (ఎన్95) ధరించాలి
⇒ ఇల్లు, ఆఫీసు గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా (వెంటిలేషన్) చూసుకోవాలి. వీలైతే ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించాలి
⇒ క్రమం తప్పకుండా రోజుకు కనీసం 20–30 నిమిషాల పాటు ప్రాణాయామం, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది
⇒ రోజూ తగినంత నీరు తాగడం వల్ల ఊపిరితిత్తులలోని శ్లేష్మం పల్చగా మారి, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్లిపోతాయి
⇒ వైద్యుల సలహా మేరకు ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) న్యుమోకోకల్ వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరిగితే ఎలాంటి లక్షణాలు కన్పించే అవకాశం?
ఊపిరితిత్తుల నష్టం శాతం- బయటకు కనిపించే లక్షణాలు
0% - 20% - ఎలాంటి లక్షణాలు ఉండవు
20% - 50% - వ్యాయామం చేసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు స్వల్ప ఆయాసం
50% కంటే ఎక్కువ - విశ్రాంతి తీసుకుంటున్నా ఆయాసం, దీర్ఘకాలిక దగ్గు, అలసట
శారీరక స్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..
శారీరక స్థితి - తీసుకోవాల్సిన చర్యలు
పూర్తిగా ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు- సాధారణ వార్షిక తనిఖీలు
సాధారణంగానే కనిపిస్తారు - స్పిరోమెట్రీ పరీక్ష అవసరం
బలహీనత లేదా అనారోగ్యం - తక్షణ వైద్య చికిత్స, పర్యవేక్షణ
Tags : 1