నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
సినిమా పండుగకు సిధ్ధం.. వేదిక మారింది.. ప్రత్యేకత ఎంటంటే?
Published on Sun, 09/20/2026 - 12:05
భారతీయ సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయడం లేదు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మారుస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తాజా అవార్డుల ప్రదానం గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ (కేవడియా) లో ఈ సెప్టెంబర్ 22, మంగళవారం జరగనుంది.
1970లో ఓసారి మద్రాసులో...
1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటివరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సాగుతూ వచ్చింది. ఒకే ఒక్కసారి 1969వ సంవత్సరానికి సంబంధించిన 17వ జాతీయ అవార్డుల ప్రదానం మాత్రం మద్రాసులో జరిగింది.
1970 నవంబర్ 21న మద్రాసులోని యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఆ ఉత్సవాన్ని చేశారు. అయితే, ఆ తర్వాత గత 55 ఏళ్ళలో నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం వేదికను మార్చే ప్రయత్నం జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తొలిసారిగా ఈ ఏడాది వేదిక మారుతోంది. ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
విగ్రహం వద్దే వేదికకై ఏర్పాట్లు
నర్మదా తీరంలో 2018లో ఏర్పాటైన 597 అడుగుల వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్‌లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణంగా రికార్డులకెక్కిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా నేషనల్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కి రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన చిత్రాలు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ సినిమాకి తొలిసారిగా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం.
మార్పు ఎందుకంటూ విమర్శలు
‘అవార్డుల ప్రదాన వేదికను ఢిల్లీ నుంచి మారిస్తే మార్చారు కానీ, గుజరాత్‌కి మార్చడమేమిట’ని జాతీయ అవార్డుగ్రహీత – సినీ దర్శకుడు రాహుల్ డోలకియా సహా పలువురు ఇప్పటికే విమర్శించారు. అయితే, ఇక నుంచి ఏటేటా వేర్వేరు నగరాల్లో ఉత్సవం జరపాలన్నది సరికొత్త విధాన నిర్ణయమనీ, అందులో భాగంగా ఈ ఏడాది గుజరాత్‌తో ఆ మార్పుకు శ్రీకారం చుట్టామనీ, రాబోయే సంవత్సరాల్లో వేరే నగరాలూ ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆతిథ్యమిస్తాయనీ అధికార వర్గాలు వివరిస్తున్నాయి
. దేశమంతటినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఈ ప్రయత్నం ఉపకరిస్తుందనీ చెబుతున్నాయి. ఆ వాదనపైనా రాజ్ ఠాక్రే లాంటి రాజకీయ నేతలు కొందరు విమర్శించారు. ‘ఒకవేళ దేశ రాజధాని బయట అవార్డుల ప్రదానం చేయాలనుకుంటే, బొంబాయి మొదలు భారతీయ సినిమాను ఇవాళ ప్రపంచ పటంపై నిలుపుతున్న హైదరాబాద్ సహా దక్షిణాది నగరాలు ఎంచుకోవాల్సింద’ని ఆయన ధ్వజమెత్తారు. కాగా, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ లాంటి మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ‘భారతదేశంలో గుజరాత్ అంతర్భాగమే కదా! అదేమీ పాకిస్తాన్ కాదు. అలాంటప్పుడు గుజరాత్లో ఎందుకు అవార్డుల ప్రదానోత్సవం చేయకూదు?’ అని ఘాటుగా జవాబిస్తున్నారు.
జాతీయ అవార్డులకు... అలా శ్రీకారం!
1953లోజాతీయ ఫిల్మ్ అవార్డులు ఇవ్వడం ఆరంభమైంది. 1953లో నిర్మాణమైన ఉత్తమ చలన– చలన చిత్రాలకు గాను 1954లో తొలిసారిగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. నిజానికి, ఉత్తమ ప్రమాణాలను గుర్తించి, ప్రోత్సహిస్తూ ఇలా ప్రభుత్వమే సినిమాలకు అవార్డులు ఇవ్వడమనేది అప్పటికి ఇంకా ఏ దేశంలోనూ లేదట. అప్పటికే, అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ‘ఆస్కార్ అవార్డులు’ పేరొందాయి. కానీ, అవి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కావు. అలాగే, అప్పటికే ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఆఫ్ బ్రిటన్’ కూడా ఉన్నాయి కానీ, అవి కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చే అవార్డులేమీ కావు. వెరసి, ఒక దేశ ప్రభుత్వం సినీ రంగాన్ని గుర్తించి, గౌరవించి అవార్డులివ్వడమనే సంస్కృతికి మనమే శ్రీకారం చుట్టినట్టయిందన్న మాట.
అప్పట్లో తొమ్మిది అవార్డులే!
చలనచిత్ర విచారణ సంఘం (ఫిల్మ్ ఎంక్వైరీ కమిటీ) ఇచ్చిన సిఫార్సు దృష్ట్యా ఈ అవార్డులను కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఆచరణ రీత్యా ఆ సిఫార్సుకు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అప్పట్లో జాతీయ అవార్డులంటే అఖిల భారత స్థాయిలో అంతా కలిపి తొమ్మిదే తొమ్మిది అవార్డులుండేవి. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ డాక్యుమెంటరీలకు రాష్ట్రపతి బంగారు పతకాలు ఇచ్చేవారు. అలాగే, ఉత్తమ బాలల చిత్రానికి ‘ప్రధానమంత్రి పతకం’ అందించేవారు. అవే కాకుండా, పై మూడు విభాగాల్లోనూ రెండేసి చొప్పున ప్రశంసా పత్రాలు అందజేసేవారు. అంతే!
ఆ వేదికపైనే చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ
తొట్ట తొలి జాతీయ అవార్డుల ప్రదానోత్సవమే మరో కీలక ఘట్టానికి కూడా వేదికైంది. ఆ తొలి అవార్డుల్లో భాగంగానే ఉత్తమ బాలల చిత్రానికి ప్రధానమంత్రి పతకం అందిస్తామని ప్రకటించారు కానీ, వచ్చిన ఎంట్రీలేవీ తగిన ప్రమాణాలతో లేవు. ‘ఖేలా ఘర్’ అనే బెంగాలీ సిని మాకు ప్రశంసా పత్రం మాత్రం బహూకరించి, సరిపెట్టాల్సి వచ్చింది. ఇలా లాభం లేదని, బాలల చిత్రాలనుప ప్రోత్సహించడం కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ బి.వి. కేస్కర్ ఆ అవార్డుల ప్రదానోత్సవం వేదికపైనే ‘చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ’ అనే రిజిస్టర్డ్ సంస్థను ్ర΄ారంభించనున్నట్టు ప్రకటించారు.
రెండో ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ...
జాతీయ అవార్డులు ఆరంభమైన రెండో ఏడాదే ప్రాంతీయ భాషలకూ ప్రత్యేకంగా అవార్డులివ్వడం ప్రారంభించారు. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రానికి ఇచ్చే రాష్ట్రపతి బంగారు పతకంతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లోని ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి రజత పతకం అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా ప్రాంతీయ భాషా చిత్రాలకూ జాతీయ గుర్తింపు ఇవ్వడం ప్రారంభించగానే... ఆ ఏడాదికి తెలుగులో వాహినీ వారి ‘పెద్ద మనుషులు’ రాష్ట్రపతి రజత పతకం అందుకుంది. అలాగే, స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్పై హీరో ఎన్టీఆర్ నిర్మించి, నటించిన ‘తోడుదొంగలు’, అక్కినేని – భానుమతి నటించిన భరణీ పిక్చర్స్ వారి ‘విప్రనారాయణ’ చిత్రాలకు ప్రశంసా పత్రాలు లభించాయి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కేటగిరీలలో అవార్డులను ప్రవేశపెట్టడంతో, అవార్డుల జాబితా అంతకంతకూ విస్తరించింది.
దక్షిణాన అందరి కన్నా ముందే... ఆంధ్రప్రదేశ్!
కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలలో మున్ముందుగా అడుగులు వేసింది... హిందీ చిత్రపరిశ్రమకు కేంద్రమైన బొంబాయి నగరం ఉన్న మహారాష్ట్ర. 1962 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులతో మరాఠీ చిత్రపరిశ్రమను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఆ వెంటనే రెండేళ్ళకు దక్షిణాదిలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పేరిట 1964 నుంచి ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు అవార్డులిచ్చి, అభినందించడం ఆరంభించింది. అప్పటికి దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమలన్నీ మద్రాసులోనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. అయినప్పటికీ, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నిటి కన్నా మున్ముందుగా తెలుగు రాష్ట్రమే ఈ రకమైన ప్రాంతీయ అవార్డుల సంస్కృతికి శ్రీకారం చుట్టడం విస్మరించరాని విశేషం. తమిళనాడు సైతం 1967 నుంచి తమ రాష్ట్రంలో ఫిల్మ్ అవార్డులను ఇవ్వనారంభించింది.
మన తెలుగు మెరుపులు
ఒకప్పుడు జాతీయ అవార్డులకూ, తెలుగు సినిమాకూ చుక్కెదురు. మహా అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే తప్ప తెలుగు సినిమాలు పెద్దగా జాతీయ స్థాయిలో కనిపించేవి కావు. జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటివి మనకెప్పుడూ అందని ద్రాక్షలుగానే ఉండేవి. తెలుగు నటి శారద లాంటి వాళ్ళు మలయాళం (‘తులాభారం’–1968, ‘స్వయంవరం’– 1972) నుంచి తెలుగు (‘నిమజ్జనం’–1977) దాకా వేర్వేరు భాషా చిత్రాల్లో నటనతో మూడు సార్లు ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డు అందుకోవడం ఒక్కటే కాస్త ఊరటగా ఉండేది.
ఆనాడు ‘శంకరాభరణం’... ఇటీవల ‘బాహుబలి’
కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ 1979వ సంవత్సరానికి గాను తొలిసారిగా జాతీయ స్థాయిలో స్వర్ణకమలం (ప్రత్యేక విభాగంలో) సాధించింది. ఆ 27వ జాతీయ అవార్డుల్లో ‘అత్యధిక ప్రజాదరణ, పూర్తి స్థాయి వినోదం, కళాత్మక విలువలు నిండిన చిత్రం’గా ‘శంకరాభరణం’ స్వర్ణకమలాన్ని సాధించింది. జాతీయ అవార్డులు మొదలయ్యాక ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక తెలుగు సినిమా స్వర్ణకమలం సాధించడం అదే ప్రథమం. అయితే, విచిత్రం ఏమిటంటే, ఆసారి జ్యూరీకి సారథి సాక్షాత్తూ తెలుగు దర్శక – నిర్మాత ఎల్వీ ప్రసాద్. అయినప్పటికీ, కారణాలేమో కానీ, అన్ని అర్హతలూ ఉన్న ‘శంకరాభరణం’ కన్నా ఓ సాధారణ హిందీ చిత్రం (‘శోధ్’)కి ఆయన జ్యూరీ పెద్దపీట వేయడం శోచనీయం.
‘శంకరాభరణం’ తర్వాత 63వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు ‘బాహుబలి–1’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దర్శకుడు రాజమౌళి తొలిసారిగా పూర్తి స్థాయిలో తెలుగు సినిమాను జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో అగ్రస్థానంలో నిలిపారు. అలా ‘శంకరాభరణం’ తర్వాత రెండోసారి స్వర్ణకమలం సాధించిన మన సినిమా ‘బాహుబలి’ అయ్యింది. ‘శంకరాభరణం’ చిత్రానికి 4 జాతీయ అవార్డులొస్తే, ఆపైన వచ్చిన బి. నరసింగరావు ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డుల్లో ఏకంగా 5 (ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కళాదర్శకుడు) పురస్కారాలు గెలుచుకుంది. ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో అన్ని అవార్డులు రావడం అదే ప్రథమం. తర్వాత రోజుల్లో నటి విజయశాంతి 1990వ సంవత్సరానికి గాను 38వ జాతీయ అవార్డుల్లో ‘కర్తవ్యం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు.
సంస్కృతంలో తెలుగు వారికి స్వర్ణకమలం!
తెలుగు సినిమా కాక΄ోయినప్పటికీ, ఓ తెలుగు నిర్మాత నిర్మించిన చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం సాధించడం ఒకే ఒక్కసారి జరిగింది. అది జి.వి. అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన సంస్కృత చిత్రం ‘భగవద్గీత’. 1992వ సంవత్సరానికి గాను ఇచ్చిన 40వ జాతీయ అవార్డుల్లో దేశమంతటిలోకీ అత్యుత్తమ చిత్రంగా ‘భగవద్గీత’ నిలిచింది. అంతటి ఘనత సాధించిన ఆ చిత్రాన్ని నిర్మించింది మన తెలుగువాడైన ప్రముఖ ΄ారిశ్రామికవేత్త, సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి కావడం విశేషం.
పెరుగుతున్న తెలుగు గాలి!
జ్యూరీల్లో తెలుగు వారికి పెరిగిన ప్రాధాన్యం సహా అనేక కారణాల వల్ల ఇటీవల జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మునుపటి కన్నా మెరుగైన ఫలితాలే సాధిస్తోంది. ఆ మధ్య 2018వ సంవత్సరానికి గాను 66వ జాతీయ అవార్డుల్లో నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటనకు గాను కీర్తీ సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అటుపైన 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ అవార్డుల్లో ‘పుష్ప–1’తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించి, సంచలనం సృష్టించారు. తెలుగు నుంచి ఆ అవార్డును అందుకొన్న తొట్ట తొలి నటుడనే రికార్డు సృష్టించారు.
ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను ఈ సెప్టెంబర్ 22న ప్రదానం చేయనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో మన తెలుగు సినిమా ఏకంగా 9 అవార్డులతో మెరిసిపోతోంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ప్రభాస్ ‘కల్కి’, ఉత్తమ బాలల చిత్రంగా ‘35... చిన్న కథ కాదు’, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు సుకుమార్ (‘పుష్ప–2’), ఉత్తమ సంభాషణల రచయితగా మరో దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) అవార్డు విజేతల్లో ఉన్నారు. ఇంకా ఉత్తమ బాల నటుడు (అరుణ్ దేవ్ పోతుల – ‘35... చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ శర్మ ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పి. రవికుమార్ ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ మన తెలుగు సినిమా జెండా ఎగరేసింది.
-ఆర్. జయ
Tags : 1