Breaking News

ఒక్క క్లిక్‌తో బ్యాంకు అకౌంట్‌ ఖాళీ! కేంద్రం హెచ్చరిక

Published on Thu, 09/03/2026 - 13:02

సైబర్‌ మోసగాళ్లు ఇప్పుడు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకే పరిమితం కావడం లేదు. సోషల్‌ మీడియా ప్రకటనలనే ఎరగా వేసుకుని మొబైల్‌ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకునే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే కొన్ని ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా హానికరమైన ఆండ్రాయిడ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C)కు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌ (NCTAU) ఈ ప్రమాదంపై ఆగస్టు 26న అడ్వైజరీ జారీ చేసింది. ‘నైట్‌ ప్లే’, ‘రిలూప్‌’, ‘కైస్‌’, ‘విమో’, ‘రివో’, ‘నెక్సో’, ‘విక్సా’ తదితర పేర్లతో ఇలాంటి యాప్‌లు ప్రచారం అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పేర్లతో మరిన్ని వేరియంట్లు ఉండొచ్చని కూడా హెచ్చరించారు.

ప్రకటన నుంచి మోసం మొదలవుతుందిలా..

ముందుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన లేదా అడల్ట్‌ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటన కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మరో వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వీడియో లేదా ఇతర కంటెంట్‌ చూడాలంటే ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తుంది.

ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌కు బదులుగా వెబ్‌సైట్‌ నుంచి APK ఫైల్‌ను నేరుగా డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకునేలా వినియోగదారులను ప్రలోభపెడతారు. అధికారిక యాప్‌ స్టోర్‌ భద్రతా తనిఖీలను దాటేసి ఫోన్‌లోకి మాల్‌వేర్‌ చేరే అవకాశం ఇక్కడే ఏర్పడుతుంది.

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఏం జరుగుతుంది?

యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత సాధారణంగా అవసరం లేని సున్నితమైన అనుమతులను కోరుతుంది. ముఖ్యంగా Accessibility Permissionను ఇవ్వాలని అడగవచ్చు. ఈ అనుమతిని దుర్వినియోగం చేస్తే మాల్‌వేర్‌ ఫోన్‌ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని చదవడం, ఇతర యాప్‌లతో పరస్పరం పనిచేయడం, వినియోగదారు తరఫున కొన్ని చర్యలు చేయడం వంటి పనులు చేయగలదు.

దీంతో బ్యాంకింగ్‌, యూపీఐ యాప్‌లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో OTPలు, PINలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించి అనధికారిక ఆర్థిక లావాదేవీలకు పాల్పడే ప్రమాదం ఉంది.

‘అప్‌డేట్‌’ పేరుతో మరో యాప్‌ కూడా..

మోసం ఇక్కడితో ఆగకపోవచ్చు. మొదట ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌.. అప్‌డేట్‌ పేరుతో మరో ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. కొన్ని వేరియంట్లు VPNను కూడా ఇన్‌స్టాల్‌ చేయగలవని I4C హెచ్చరించింది. దీంతో ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ దాడి చేసేవారి నియంత్రణలోని సర్వర్ల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది.

మరికొన్ని సందర్భాల్లో హానికరమైన యాప్‌ను సాధారణ పద్ధతిలో అన్‌ఇన్‌స్టాల్‌ చేయకుండా అడ్డుకునే సామర్థ్యం కూడా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

మీ ఫోన్‌లో అకస్మాత్తుగా తెలియని యాప్‌ కనిపించడం, మీ ప్రమేయం లేకుండానే స్క్రీన్‌పై ట్యాపింగ్‌ జరగడం, గుర్తు తెలియని VPN కనిపించడం లేదా Accessibility సెట్టింగ్స్‌లో అనుమానాస్పద యాప్‌కు యాక్సెస్‌ ఉండటం వంటివి ప్రమాద సంకేతాలు కావచ్చు.

ప్రత్యేకించి ఏదైనా యాప్‌ పని చేయాలంటే Accessibility Access వంటి అధిక స్థాయి అనుమతి తప్పనిసరిగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలి.

ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏం చేయాలి?

I4C సూచనల ప్రకారం వినియోగదారులు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

  • యాప్‌లను సాధ్యమైనంత వరకు గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా విశ్వసనీయ యాప్‌ స్టోర్ల నుంచే ఇన్‌స్టాల్‌ చేయాలి.

  • సోషల్‌ మీడియా ప్రకటనలు, వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకుల ద్వారా వచ్చే APK ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయకూడదు.

  • ‘గూగుల్‌ప్లే ప్రొటెక్ట్‌’ను ఆన్‌లో ఉంచాలి.

  • ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి.

  • తెలియని యాప్‌లకు Accessibility Permission ఇవ్వకూడదు.

  • ఫోన్‌లోని ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను తరచూ పరిశీలించాలి.

  • గుర్తు తెలియని యాప్‌ కనిపిస్తే వెంటనే తొలగించాలి.

  • బ్యాంక్‌, UPI లావాదేవీలను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

ఇప్పటికే మోసపోయారా? వెంటనే 1930కు కాల్‌ చేయండి

అనుమానాస్పద యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత బ్యాంక్‌ ఖాతాలో అనధికారిక లావాదేవీ జరిగినా, ఫోన్‌ నియంత్రణ కోల్పోయినట్లు అనిపించినా ఆలస్యం చేయకూడదు. జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలి. సైబర్‌ నేరాలను అధికారిక నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా కూడా నివేదించవచ్చు. 1930 హెల్ప్‌లైన్‌ 24 గంటలూ అందుబాటులో ఉంది.

మాల్‌వేర్‌ తొలగించడం సాధ్యం కాకపోతే ముఖ్యమైన డేటాను సురక్షితంగా బ్యాకప్‌ చేసుకున్న తర్వాత ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలని కేంద్రం సూచించింది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఒత్తిడి

ఈ తరహా మోసాలపై ప్రభుత్వ హెచ్చరికల తర్వాత ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్య సంస్థ మెటా కూడా అనేక అనుమానాస్పద ప్రకటనలను తొలగించింది. అయితే ప్రభుత్వ హెచ్చరిక వెలువడిన తర్వాత కూడా కొన్ని ప్రకటనలు కనిపించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో మోసపూరిత ప్రకటనలను గుర్తించి తొలగించడంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)