రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
Breaking News
భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధికి సిద్ధం
Published on Thu, 08/27/2026 - 06:17
ముంబై: భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దేశీయ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ‘ఇమామి’ వ్యవస్థాపకుడు, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ మార్కెట్లలో వినియోగం మళ్లీ ఊపందుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ (ప్రీమియమైజేషన్) పెరుగుతుండటం కంపెనీకి కలిసివస్తుందన్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
గ్రామీణ రికవరీతో అధిక లబ్ధి
అనుకూలమైన వర్షపాతం, మెరుగైన వ్యవసాయ రాబడులు, పెరుగుతున్న కొనుగోలు శక్తి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మళ్లీ వేగం పుంజుకుంటోందని గోయెంకా పేర్కొన్నారు. ‘‘ఇమామి వ్యాపారంలో అత్యధిక భాగం గ్రామీణ భారతంతోనే ముడిపడి ఉంది. అక్కడ మా బ్రాండ్లకు దశాబ్దాల నమ్మకం ఉంది. జీఎస్టీ సవరణల వల్ల సంఘటిత రంగానికి చెందిన ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రికవరీ ద్వారా అత్యధిక లబ్ధి పొందేందుకు ఇమామి వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగం పెరగడం, ఆరోగ్యం–వెల్నెస్పై అవగాహన పెరగడం తమకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వివరించారు. నాన్–సీజనల్ ఉత్పత్తులను బలోపేతం చేయడం, కొత్త తరం కన్జూమర్ ప్లాట్‌ఫారమ్‌లలోకి విస్తరించడం ద్వారా కంపెనీని మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు.
వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యం
హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘యాక్సియమ్ ఆయుర్వేద’తో పాటు ‘ఇంక్‌నట్ డిజిటల్’కు చెందిన డిజిటల్–ఫస్ట్ బ్రాండ్లు ‘వేదిక్స్’, ‘స్కిన్‌క్రాఫ్ట్’లలో సాధించిన వాటాలు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గోయెంకా తెలిపారు. తమ వ్యూహాత్మక పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై26) కన్సాలిడేటెడ్ టర్నోవర్‌లో దాదాపు ఆరు శాతం వాటాను అందించాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై27)లో ఈ వాటా 16 శాతానికి, ఎఫ్వై30 నాటికి 25 శాతానికి (నాలుగో వంతు) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణ
ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ స్వదేశీ వినియోగం, మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన స్థిరత్వంతో భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందన్నారు. బంగ్లాదేశ్, పశి్చమాసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక తయారీ సామర్థ్యం, వినియోగదారుల కేంద్రీకృత వ్యూహాలతో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ బ్రాండ్ల బలం, కస్టమర్ల నమ్మకంతో ఇమామి ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.
Tags : 1