అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం
Published on Mon, 08/24/2026 - 00:53
మనిషి జీవితం బయట కనిపించే దానికంటే లోపల జరిగేదే ఎక్కువ. నవ్వుతున్న ముఖాల వెనుక ఎన్నో మౌనవేదనలు దాగి ఉంటాయి. చుట్టూ మనుషులు ఉన్నా, లోపల ఒంటరితనం వెంటాడుతుంటుంది. శరీరం అలసిపోయిందంటే విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనసు అలసిపోతే జీవితం మొత్తమే భారంగా అనిపిస్తుంది. అందుకే మానసిక ప్రశాంతత మనిషి ఆరోగ్యానికి అసలైన పునాది.
ఇప్పటి ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఆ పరుగులో మనిషి తన మనసునే వెనక్కి వదిలేస్తున్నాడు. ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచే ఆలోచనల రభస మొదలవుతుంది. ఎంత సంపాదించాలి? ఎలా నిలబడాలి? ఇతరులకంటే ఎలా ముందుండాలి? అనే పోటీ భావన మనిషిని నిరంతరం మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఈ ఆందోళనల మధ్య ప్రశాంతంగా జీవించడం కూడా ఒక కళగా మారిపోయింది. మనసు అనేది విచిత్రమైన ప్రపంచం. ఒక్క క్షణంలో ఆకాశమంత ఆనందంలో విహరిస్తుంది. మరోక్షణంలోనే అగాధమైన నిరాశలోకి జారిపోతుంది. గత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తడిమి చూస్తుంది. జరిగిపోయిన సంఘటనలను వదలలేక బాధపడుతుంది. రానున్న భవిష్యత్తును ఊహిస్తూ భయపడుతుంది. ఈ రెండిటి మధ్య వర్తమానాన్ని ఆస్వాదించడం మరిచిపోతుంది. అందుకే మనిషి జీవితం బయట కంటే మనసులోనే ఎక్కువగా అలసిపోతుంది.
మనిషి ఎదుర్కొనే ప్రతి బాధకు కారణం పరిస్థితులే కావు. ఆ పరిస్థితులను మనసు స్వీకరించే విధానం కూడా కారణమే. చిన్న అపజయాన్ని జీవితాంతం మోస్తూ ఉండటం, ఇతరుల మాటలను గుండెల్లో పెట్టుకోవడం, ప్రతి విషయాన్ని మనసుకు భారం చేసుకోవడం ఇవే మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.
ఈ కాలంలో మనుషులు మాట్లాడటం తగ్గించి, మనసులో దాచుకోవడం పెంచేశారు. బాధను బయటపెడితేబలహీనులమవుతామనుకుంటున్నారు. కానీ మౌనం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. మనసులో పేరుకుపోయిన వేదన నెమ్మదిగా మనిషిని లోపల కుంగదీస్తుంది. అందుకే మన భావోద్వేగాలను పంచుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మాట్లాడాలి. ఒక చిన్న ఓదార్పు కూడా కొన్నిసార్లు మనిషిని మళ్లీ నిలబెడుతుంది.
జీవితంలో డబ్బు, హోదా, విజయాలు అన్నీ అవసరమే. కానీ వాటికంటే ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు. రాత్రి నిద్రపోయేటప్పుడు మనసులో భయం లేకపోవడం, ఉదయం లేచినప్పుడు జీవితం మీద ఆశ ఉండటమే నిజమైన ఆనందాలు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేని జీవితం వెలుగులేని దీపంలాంటిది. అందుకే మనిషి ముందుగా తన మనసును ప్రేమించుకోవాలి. ఆలోచనలకు అదుపు నేర్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడే సహనాన్ని పెంపొందించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే జీవితం అందంగా మారుతుంది. మానసిక ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం. అదే జీవితానికి అసలైన అర్థం.
అనవసరమైన పోలికలు కూడా మనిషిని లోపల ఖాళీ చేస్తుంటాయి. ఇతరుల విజయాన్ని చూసి తన జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకునే అలవాటు నెమ్మదిగా ఆత్మన్యూనతాభావంగా మారుతోంది. నిజానికి ప్రశాంతత బయట దొరికేది కాదు. అది మన ఆలోచనలలో పుడుతుంది. మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు, తన పరిమితులను అంగీకరించినప్పుడు, జీవితాన్ని సహజంగా స్వీకరించినప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతతను అందుకుంటుంది. ప్రతిసమస్యను గుండెల్లో మోస్తూ జీవించడం కన్నా, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి చీకటి శాశ్వతం కాదు. ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనసుకి విశ్రాంతి ఇవ్వాలి. రోజంతా శరీరం పని చేసినట్టే, మనసు కూడా అలసిపోతుంది. అందుకే కొంత సమయం మనతో మనం గడపాలి. ప్రకృతిని ఆస్వాదించాలి. మంచి పుస్తకాలు చదవాలి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినాలి. ధ్యానం, యోగా,ప్రాణాయామం వంటి సాధనలు అలవాటు చేసుకోవాలి. ఇవి కేవలం వ్యాయామాలు కాదు మనసును నిలకడగా ఉంచే మార్గాలు.
– ఎన్. లహరి
Tags : 1