కళ నేర్చిన కాళ్లు కవాతు నేర్పాయి..

Published on Fri, 08/14/2026 - 06:02

‘ఇంత లావణ్యరాశివి. నువ్వు తుపాకీ పట్టావా?’ అన్నాడు బ్రిటిష్‌ అధికారి.
‘క్షమాపణ అడుగు. ఉరిశిక్ష రద్దు చేస్తాను’ అని కూడా అన్నాడు. 
ఆమె అడగలేదు. కాన్పూర్‌లో ఆమె నాట్యగత్తె మాత్రమే కాదు
తన దేశభక్తితో బ్రిటిష్‌వారిని ఉరుకులెత్తించిన వీరనారి. 
400 మంది మహిళలతో సైన్యం తయారు చేసిన దళనాయకి.
పేరు అజ్జన్‌ బాయి. వృత్తికి ‘తవాయిఫ్‌’. కాని దేశానికి వీరపుత్రిక.

ఆడు’... అంటే ఆడాలి. ‘పాడు’ అంటే పాడాలి. నవాబుల కాలంలో ఉత్తరభారతంలో ‘తవాయిఫ్‌’లుగా పేరుబడ్డ నాట్యగత్తెల జీవితం అది. దక్షిణాదిన ‘దేవదాసీ’లది, ఉత్తరాదిన ‘తవాయిఫ్‌’లది సమాజంలో ఒకేలాంటి స్థానం. కాని ఈ ‘దేవదాసీ’ల్లో ఈ ‘తవాయిఫ్‌’లలోనూ చరిత్రను లిఖించిన వారు ఎందరో ఉన్నారు. కాన్పూరుకు చెందిన అజ్జన్‌ బాయిది అలాంటి చరిత్ర. 1857 తిరుగుబాటులో కాన్పూర్‌ వేదికగా సిపాయిలను నడిపించి, నాట్యగత్తె ముసుగులో గూఢచారిగా మారి, చివరకు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అజ్జన్‌బాయి వీరగాథ నేటికీ ఒక అద్భుతం.

లక్నో నుండి కాన్పూర్‌ కోఠా వరకు
అజ్జన్‌బాయిది లక్నో. అమె అసలు పేరు అజీజున్నిసా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆ రోజుల్లో అలాంటి ఆడపిల్లల్ని ‘కోఠా’ (నాట్యగత్తెలు ఉండే చోటు)లకు తరలించేవారు. అలా అజ్జన్‌బాయి లక్నో నుంచి కాన్పూర్‌కు మారి ‘లడ్కీ మహల్‌’ అనే కోఠాకు చేరింది. అయితే కాళ్లకు గజ్జెలు కట్టడం కంటే చేతిలో పుస్తకం పట్టడం గురించే అజ్జన్‌బాయి ధ్యాస. తన నాట్యం చూడటానికి వచ్చే పెద్దమనుషుల ద్వారా దేశ పరిస్థితులు తెలుసుకునేది. పెద్దమనుషులు ఇళ్లలోని స్త్రీలతో ఏ విషయాలూ పంచుకోకపోయినా ఇలాంటి చోట అనేకం విశదపరుస్తుంటారు. అప్పటికి తవాయఫ్‌ అంటే కేవలం సాహిత్యం, సంగీతం, సంస్కృతికి చిహ్నం. కానీ 1856లో బ్రిటిష్‌ వారు అవధ్‌ను ఆక్రమించిన తర్వాత తవాయిఫ్‌లను ‘వేశ్యలు’ అని ముద్ర వేశారు. దాంతో వారికి రాజాశ్రయం పోయింది. గౌరవం పోయింది. అప్పుడే అజ్జన్‌ గుండెలో కోపం పుట్టింది. ఆ కోపమే దేశభక్తి అయ్యింది.

మస్తానీ దళం 
1857 మే నెలలో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలై విప్లవజ్వాలలు దేశవ్యాప్తంగా ఎగసిపడినప్పుడు అజ్జన్‌బాయి నేరుగా రంగంలో దిగింది. కాన్పూర్‌లో ఆమె తన తోటి మహిళలతో కలిసి ‘మస్తానీ దళం’ అనే ప్రత్యేక మహిళా సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళలు పగటిపూట వీధుల్లో తిరుగుతూ విప్లవకారుల్లో ధైర్యాన్ని నింపేవారు. గాయపడిన భారతీయ సైనికులకు సేవలు చేస్తూ, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవారు. రాత్రివేళల్లో బ్రిటిష్‌ అధికారుల ముందు నాట్యం చేస్తూ, వారు మత్తులో ఉన్నప్పుడు రహస్య సైనిక సమాచారాన్ని సేకరించేవారు. ఆ సమాచారాన్ని నానా సాహెబ్, తాంతియా తోపే వంటి విప్లవ నాయకులకు చేరవేస్తూ గూఢచారులుగా పని చేశారు.

మగ దుస్తుల్లో యుద్ధరంగంలోకి...
కాన్పూర్‌లో బ్రిటిష్‌ వారికి భారీ సైనిక హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. జూన్‌లో నానాసాహెబ్‌ నాయకత్వంలో తిరుగుబాటుదారులు ఈ హెడ్‌క్వార్టర్స్‌ను మూడు వారాలు దిగ్బంధించారు. దెబ్బకు బ్రిటిష్‌ వారు ఓటమి అంగీకరించి అలహాబాద్‌ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో అజ్జన్‌బాయి స్వయంగా మగవారి దుస్తులు ధరించి, గుర్రమెక్కి, రెండు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని సైనికుల కవాతులో పాల్గొంది. శత్రువుల ఫిరంగి గుండ్లు ముంచెత్తుతున్నా భయపడకుండా స్వయంగా బ్రిటిష్‌ సైన్యంతో పోరాడింది. కేవలం 25 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన ఈ రణరూపం బ్రిటిష్‌ సైన్యాన్ని వణికించింది.

హావ్‌లాక్‌ కోర్టు మార్షల్‌
దెబ్బ తిన్న బ్రిటిష్‌వారు శక్తి కూడదీసుకొని చెలరేగారు. కాన్పూర్‌ను భారీ సైన్యంతో బ్రిటిష్‌ జనరల్‌ హావ్‌లాక్‌ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు కాన్పూర్‌ వాసులను ఊచకోత కోశాడు. అజ్జన్‌బాయిని బంధించాక ఆమెను చూసి ‘ఇంత అందమైన మహిళ ఇంతటి వీరత్వాన్ని ఎలా ప్రదర్శించిందో’ అని హావ్‌లాక్‌ ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి, విప్లవకారుల రహస్యాలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం’ అని ఆశ చూపాడు. దానికి అజ్జన్‌బాయి ‘నువ్వు నా ప్రాణాలు తీయగలవు కానీ నా తల వంచలేవు. నాకు కావాల్సింది బ్రిటిష్‌ సామ్రాజ్య నాశనం మాత్రమే’ అని గర్జించింది. 

కోపంతో ఊగిపోయిన హావ్‌లాక్‌ ఆమెను కాల్చి చంపాలని ఆదేశించాడు. ఫైరింగ్‌ స్క్వాడ్‌ ఆమె ముందు నిలబడి బుల్లెట్లు గుండెల్లోకి దింపుతున్నా చిరునవ్వుతో, దేశభక్తి నినాదాలు చేస్తూ ఆమె అమరురాలయ్యింది. ఇవాళ చరిత్ర పుస్తకాల్లో అజ్జన్‌బాయి పేరు లేదు. కానీ కాన్పూర్‌ గల్లీల్లో ఇప్పటికీ ఆమె కథ చెప్పుకుంటారు. నృత్యానికి ఆడించాల్సిన చేతులతో ఆమె తుపాకీ పట్టింది. ఎందుకంటే ఆమెకు తెలుసు సంస్కృతి బతకాలంటే స్వాతంత్య్రం ముఖ్యమని. భావితరాల మేలు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసిన అమర వీరురాలు అజ్జన్‌బాయి. అలాంటివారిని స్మరించుకునే వేళే మన సిసలైన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక.

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)