Breaking News

నా స్వేచ్ఛావనం నా స్నేహితురాలు

Published on Sun, 08/02/2026 - 00:58

స్కూల్‌ బెంచ్‌ నుండి బోర్డ్‌ మీటింగ్‌ వరకు... 
మొదటి పీరియడ్స్‌ భయం నుండి మొదటి డెలివరీ ఆందోళన వరకు... 
ఒకే ఒక్క తోడు... స్నేహితురాలు!

స్త్రీ జీవితంలో ఎన్నో పాత్రలు. 
కూతురు, భార్య, కోడలు, అమ్మ...
ప్రతి పాత్ర పక్కన తప్పదు ఆమె తోడు.

ఒత్తిడి చుట్టుముట్టినప్పుడు, 
కన్నీళ్లు ఆనకట్ట తెంచుకున్నప్పుడు, 
గట్టిగా నవ్వాలనిపించినప్పుడు... 
ప్రతి స్త్రీ వెతుక్కునేది ఆమె పేరు.

 ప్రాణస్నేహితురాలే 
ప్రతి స్నేహితురాలి సగం ఆకాశం.

ఆ రోజు బాక్స్‌ కట్టుకెళ్లలేదు. లంచ్‌ బెల్‌ కొట్టాక నోట్స్‌ రాసుకున్నట్టు యాక్షన్‌ చేస్తుంటే వచ్చి కూచుంది. టిఫిన్‌ బాక్స్‌ తెరిచి ‘నా దగ్గర అన్నం ఉంది, నీకు సగం ఇస్తా’ అని ముద్ద కలిపి పెట్టింది. అది అన్నం అనుకోలేదు. స్నేహం అనుకున్నాను. లెక్కల టీచరు మాటిమాటికి తిడుతూ ఉంటే బెంచ్‌ కింద నుండి చేతిని గట్టిగా పట్టుకుని ‘భయపడకు’ అని కళ్లతోనే ధైర్యం చెప్పేది. ఆ రోజుల్లో స్నేహమంటే ఏముంది? పెన్ను అడగడం... రబ్బరు సగానికి కోసి పంచుకోవడం.... పరీక్షలో తెలియని ప్రశ్నకు ‘ఇది రాయి’ అని అందించుకోవడం.... అంతేగా. అన్నీ తను చేసేది. ‘నువ్వు నా ఫ్రెండువి. నాకు మాత్రమే ఫ్రెండువి’ అన్నట్టుండేది. కలిసి వెళ్లిన సినిమా, కుట్టించుకున్న పూలజడ, ఆడిన ఆటలు... తిరిగి రావు. కాని స్నేహితురాలి మాటలో, రూపంలో, తోడులో అవన్నీ సజీవంగా ఉంటాయి. ఉండిపోతాయి. ఆస్తులు, మెడలో ధగధగలు అందరి దగ్గరా ఉండొచ్చు. కాని నిజమైన స్నేహితురాలు ఉన్నవాళ్లే పది కోకాపేటల ఓనర్లు.

హాస్టల్‌లో పెద్దదిక్కు
ఊరుగాని ఊరు. అమ్మతోడు లేని చోటు. ఊరికూరికే ఏడుపొస్తుంటే పక్కబెడ్‌ నుండి లేచి తల నిమిరింది. ‘ఏంటే... అంత హోమ్‌ సిక్‌ ఎందుకు? మేమంతా లేమా’ అని గద్దించి, బెంగపోవడానికి తెల్లవార్లు శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ కబుర్లు చెప్పింది. ఒకప్పుడు హాస్టల్‌లో ఉంటే బెంగ. ఫ్రెండ్‌ దొరికాక ఇంట్లో ఉంటే బెంగ. మొదటి ప్రేమ, మొదటి చూపు... ఆ అలజడులన్నీ పంచుకునే ఏకైక డైరీ– ఫ్రెండు. బ్రేకప్‌ అయిన రాత్రి నలిగిపోయిన మనసుతో ఏడుస్తుంటే, ఏమీ అడగకుండా గట్టిగా పొదువుకొని ఒళ్లో తలపెట్టుకోమనే ఓ అమృతస్పర్శ.

పక్క డెస్క్‌లో సోల్‌ సిస్టర్‌
ఉద్యోగంలో అంతా బెరుకే. బాస్‌ తిట్టినప్పుడు, సీనియర్‌ ఏడిపించినప్పుడు, ప్రమోషన్‌ రానప్పుడు... పక్క డెస్క్‌ నుంచి వినిపించే మాట– ‘నువ్వు డిజర్వ్‌ చేస్తావే’... కలీగ్‌లా ఎప్పుడూ లేదు.  ప్రాణస్నేహితురాలిగానే. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఆఫీస్, ఇల్లు బ్యాలెన్స్ చేయలేక ఏడుస్తుంటే ‘ఈ రోజు నీ పని నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్‌ తీసుకో’ అని చెప్పే సోల్‌ సిస్టర్‌. తను రెండు కప్పుల వేడి కాఫీతో వచ్చి పక్కన కూర్చుందంటే ఆ రిలాక్సేషన్‌ ఏ థెరపిస్ట్‌ కూడా ఇవ్వలేదు. ‘పోతే పోయింది ఉద్యోగం.. మనశ్శాంతి ముఖ్యం’ అని ఆమె చెప్పే ఒక్క మాట చాలు, మళ్లీ కీబోర్డ్‌పై వేళ్లు పరుగెత్తడానికి! జీవితం ఎన్ని బాధ్యతలు మోపినా వెన్ను కాసే సైనికురాలు. బలహీనతలను బలంగా మార్చే మంత్రగత్తె.

తన వల్లే కదా జగతి
 ప్రాణ స్నేహితురాలు లేకపోతే రోజులు ఇలా గడిచేవా? రాత్రి రెండు గంటలకు ‘నిద్రపట్టడం లేదే’ అని వాయిస్‌ నోట్‌ పంపితే టక్కున కాల్‌ చేస్తుందే! ఫిజికల్‌గా దూరంగా ఉన్నా, మానసికంగా అతి దగ్గర. వలపోసుకుంటుంటే ఏ తీర్పు చెప్పకుండా కేవలం వినే ఒక చెవి . ‘ఏడవు, నేనున్నా’ అని చెప్పే గుండె. 

స్నేహం అంటే రోజూ కలవడం కాదు. ఏడాదికి ఒకసారి కలిసినా, కలిసిన వెంటనే ‘నువ్వు ఏం మారలేదే’ అనిపించడం. మగవారి స్నేహంలోని లాజిక్‌లు ఆడవారి స్నేహంలో ఉండవు. ఇక్కడ కేవలం ఎమోషన్స్ ఉంటాయి. ఒక మహిళ శారీరక, మానసిక వేదనను ఇంకొక మహిళ మాత్రమే అర్థం చేసుకోగలదు. సమాజం స్త్రీకి ఎన్నో చట్రాలు బిగిస్తుంది. ఆ చట్రాలన్నింటినీ విప్పి, హాయిగా ఊపిరి పీల్చుకునే ఏకైక స్వేచ్ఛావనం... స్నేహితురాలు! ఆమె ముందు ఎలాంటి మేకప్‌లు అక్కర్లేదు, అబద్ధాలు అవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని ఏళ్లు మాట్లాడకపోయినా... అవసరమైనప్పుడు ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌తో పాత స్నేహం మళ్లీ  ప్రాణం పోసుకుంటుంది. 

అందుకే ఈ ఫ్రెండ్‌షిప్‌ డే రోజున మీ ఫోన్‌ తీసి, మీ జీవితపు ‘సేఫ్‌ జోన్‌’ అయిన మీ స్నేహితురాలికి చిన్న వాయిస్‌ నోట్‌ పంపండి. ‘నువ్వు నా లైఫ్‌లో ఉన్నందుకు థాంక్స్‌... హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే!’ అని చెప్పేయండి. లోకమంతా ఒకవైపు, మీ ఇద్దరి స్నేహం ఒకవైపు అని ఆమెకు గుర్తు చేయండి. 
మీ ఒక్క మెసేజ్‌ ఆమె ముఖంలో ఎంతటి అమూల్యమైన చిరునవ్వును పూయిస్తుందో చూడండి! 

చాలామంది మీ జీవితంలోకి వచ్చి వెళ్తుంటారు.
కానీ స్నేహితులు మాత్రమే 
మీ హృదయంలో చెరగని ముద్ర వేస్తారు.
– ఎలియనర్‌ రూజ్‌వెల్ట్, అమెరికన్‌ యాక్టివిస్ట్‌

స్నేహితుడి పని ఏమిటంటే 
ప్రత్యేకంగా ఒక పని అంటూ 
ఏదీ లేకపోవడమే!
– డెట్లెఫ్‌ కార్టెస్, మ్యూజికల్‌ ఆర్టిస్ట్‌

ప్రపంచమంతా
మిమ్మల్ని వదిలి వెళుతున్నప్పుడు
మీతో కలిసి నడిచేవాడే 
నిజమైన స్నేహితుడు.
– వాల్టర్‌ విన్‌చెల్, ప్రముఖ జర్నలిస్ట్‌

ప్రియ మిత్రమా...
నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు
బాధలు మాయమవుతాయి.
దుఃఖాలన్ని తొలగిపోతాయి.
– విలియం షేక్సి ్పయర్‌

– కె

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)