మేకప్ మినిస్టర్ ఏమైపోయాడు..? సత్యకుమార్ యాదవ్‌పై కారుమూరి సెటైర్లు..!
Breaking News
ఎన్టీఆర్ వద్దని చెబితే ఈ పనులన్నీ ఆపేస్తాం : RAW NTR వ్యవస్థాపకుడు
Published on Sat, 07/18/2026 - 12:22
సాక్షి, తిరుపతి: ‘అభిమానాన్ని వృధా చేయకండి.. పది మందికి సాయం చేసే పనులు చేయండి’ అని పదేళ్ల క్రితం ఓ ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు విని సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు రా ఎన్టీఆర్ (RAW NTR) వ్యవస్థాపకుడు సాయి రూప్. కొద్దిరోజులుగా రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుపతిలో సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్, సంస్థ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయి రూప్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన సేవలు ఎవరూ చేయలేదని, సేవ అంటే అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని.. ఏదైనా చేయవచ్చునని చెప్పారు.గత వారం రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, వంద కోట్ల మోసగాడు అంటూ, అభిమానులు ముసుగులో దందా చేస్తున్నారు అంటూ అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు సంబంధం లేకుండా మాకు వ్యతిరేకంగా లేఖ విడుదల అయినట్లు అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. ''మాకు వ్యతిరేకంగా లేఖ ఎలా వచ్చింది అనేది మాకు కూడా అర్ధం కాలేదని.. ఎన్టీఆర్ స్వయంగా చెబితే.. ఈ పనులు ఆపేస్తామ''ని సాయి రూప్ స్పష్టం చేశారు.
అనంతరం తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు – వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సంస్థపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
‘మేము చేపట్టబోయే సేవా కార్యక్రమాల్ని మూడు అడుగులుగా విభజించాం. అందులో మొదటిది ‘సేవతో యువ జాగృతి’, యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
రెండో అడుగు ‘మన ఊరు మన బాధ్యత’: గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాం.
మూడో అడుగు ఊరి మాట.. పాలకుల దాకా..: గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది’ అని సాయి రూప్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.
Tags : 1