టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?
Breaking News
త్వరలో ఓపెన్‌ఏఐ స్మార్ట్ స్పీకర్!
Published on Wed, 07/15/2026 - 11:55
కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగాన్ని దాటి కన్స్యూమర్ హార్డ్‌వేర్ మార్కెట్‌పై కన్నేసింది. ఇప్పటివరకు మన స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో అప్లికేషన్ రూపంలో డిజిటల్‌గా మాత్రమే పరిచయమున్న ‘చాట్‌జీపీటీ’ సాంకేతికత.. త్వరలోనే మన ఇళ్లలో ఒక భౌతిక రూపంలో దర్శనమివ్వబోతోంది. అంతర్జాతీయ టెక్ వర్గాల తాజా లీకుల ప్రకారం, ఓపెన్ ఏఐ తన మొదటి స్వతంత్ర హార్డ్‌వేర్ పరికరంగా ఒక సరికొత్త ‘స్మార్ట్ స్పీకర్’ను తెరపైకి తెచ్చింది.
అయితే, ఇది మార్కెట్లో ప్రస్తుతం లభించే అమెజాన్ ఎకో లేదా యాపిల్ హోమ్‌పాడ్ వంటి సాధారణ స్పీకర్ కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి స్క్రీన్ (డిస్‌ప్లే) ఉండదు. కానీ, ఇది స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ప్రాణమున్న ఒక ఏఐ తోడులా మనతో సంభాషిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లో ఒక మనిషి తరహా ఉనికిని చాటడమే దీని ప్రత్యేకత.
సాంకేతిక నైపుణ్యం - ప్రత్యేకతలు
ఈ పరికరంలో అధునాతన ఇన్-బిల్ట్ కెమెరాలు, పర్యావరణ సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, వ్యక్తులను, వస్తువులను నిశితంగా గమనించగలవు. అంతేకాదు, వినియోగదారుడి దినచర్యలు, అలవాట్లను, చివరికి వారి ఈమెయిళ్లను సైతం విశ్లేషించి వారు అడగకముందే అవసరాలను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఓపెన్ ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘జీపీటీ-లైవ్’ వాయిస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనివల్ల మనం మాట్లాడుతున్నప్పుడే అది వినగలదు. ఒకే సమయంలో సహజమైన మనుషులలాగా స్పందించగలదు. రీఛార్జబుల్ బ్యాటరీ సదుపాయం ఉండటం వల్ల వంటగది నుంచి బెడ్‌రూమ్ వరకు ఇంట్లో ఎక్కడికైనా సులభంగా తరలించుకోవచ్చు.
యాపిల్‌తో వైరం.. మార్కెట్ సవాళ్లు
యాపిల్ మాజీ డిజైన్ ఇంజినీర్ జోనీ ఐవ్ నేతృత్వంలోని బృందంతో కలిసి ఓపెన్ ఏఐ సుమారు ఐదు విభిన్న హార్డ్‌వేర్ ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక హార్డ్‌వేర్ ప్రస్థానానికి ప్రారంభంలోనే చట్టపరమైన బ్రేక్ పడింది. ఓపెన్ ఏఐ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందంటూ యాపిల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయపరమైన వివాదం కారణంగా ఈ పరికరం మార్కెట్ ఎంట్రీ కొంత ఆలస్యం కావచ్చు. ఓపెన్ ఏఐ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఈ పరికరాన్ని అధికారికంగా ఆవిష్కరించి, 2027 ఫిబ్రవరి నాటికి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
Tags : 1