మొసాద్ కంటే డేంజర్.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో
Breaking News
కార్పొరేట్ అగ్రపీఠంపై మిలీనియల్స్ జైత్రయాత్ర!
Published on Thu, 07/09/2026 - 17:39
భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన ‘సీ-సూట్’ (C-Suite - CEO, CFO, CMO, CTO.. వంటి కీలక పదవులు) స్థానాలను యువత వేగంగా చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లలో మిలీనియల్స్ (యువతరం) ఏకంగా 55 శాతం వాటాతో అతిపెద్ద లీడర్‌షిప్ గ్రూప్‌గా అవతరించారు. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత ఏడేళ్లలో సీ-సూట్ విభాగంలో మిలీనియల్స్ ప్రాతినిధ్యం 14.5 శాతం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వ్యాపార నిర్ణయాలను శాసిస్తున్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
మారుతున్న కెరీర్ ముఖచిత్రం
గతంలో ఒకే పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్నవారికే లీడర్‌షిప్ పాత్రలు దక్కేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. సీ-సూట్ నాయకుల్లో ఒకే పరిశ్రమకు పరిమితమైన వారి సంఖ్య గతంలో 80 శాతం ఉండగా ఇప్పుడది 58 శాతానికి పడిపోయింది. అంటే.. వివిధ సంస్థలు, విభిన్న రకాల వ్యాపారాలు, మల్టిపుల్ ఫంక్షన్స్‌లో అనుభవం ఉన్నవారికే కంపెనీలు పట్టం కడుతున్నాయి.
మరోవైపు, ఏఐ రాకతో కార్పొరేట్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని 84 శాతం మంది లీడర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు (సీఎంఓ) అత్యధికంగా 94 శాతంతో ఈ మార్పును బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో 84 శాతం మంది లీడర్లు ఏఐ టూల్స్ ఇచ్చే ఇన్‌పుట్స్‌ను కీలకంగా వాడుతుండటం గమనార్హం.
మార్కెట్ కంటే వేగంగా నేర్చుకోవాలి!
‘భారత కార్పొరేట్ నాయకత్వం ఇప్పుడు అత్యంత సవాలుతో కూడిన దశలోకి ప్రవేశించింది. ఏఐ యుగంలో పాత రూల్ బుక్స్ కాలంచెల్లుతుంది. స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోయినా లీడర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వ్యాపార వ్యూహాలకు సాంకేతికత, ప్రతిభను జోడిస్తున్నవారే సఫలమవుతున్నారు. మార్కెట్ మారుతున్న వేగంతో సమానంగా లీడర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి’ అని లింక్డ్‌ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ తెలిపారు.
వేగం పెంచాలనే ఒత్తిడి
టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు లీడర్లకు పెద్ద పరీక్షగా మారింది. దాదాపు ఐదింటిలో నలుగురు (79%) సీ-సూట్ లీడర్లు.. ఏఐ వల్ల కలిగే పూర్తి ఫలితాలను అంచనా వేయడానికి ముందే దానిని వ్యాపారాల్లో వేగంగా అమలు చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి సీఎంఓల్లో 82 శాతం, సీటీఓల్లో 81 శాతంగా ఉంది. అలాగే, తీవ్రమైన అనిశ్చితి మధ్య అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని 39 శాతం మంది లీడర్లు (ముఖ్యంగా 46% మంది సీఎంఓలు, 43% మంది సీఈఓలు) అంగీకరిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు
Tags : 1