రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..
Published on Fri, 07/03/2026 - 13:30
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేయడం ద్వారా క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానాన్ని కంపెనీ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో అధిక ప్రారంభ వ్యయం ప్రధాన అడ్డంకిగా ఉండేది. కొత్త బాస్ మోడల్‌లో వినియోగదారులు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ లేదా ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గి, ఈవీ యాజమాన్యం మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్లలోనూ అప్‌డేట్
బాస్ మోడల్‌తో పాటు క్రెటా ఎలక్ట్రిక్‌లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా హ్యుందాయ్ జోడించింది. అన్ని సంబంధిత వేరియంట్లలో ‘ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వాహనంలోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ ఛార్జర్ వేరియంట్లలో 7.4 కిలోవాట్ల వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ప్రామాణికంగా అందిస్తోంది.
రెండు బ్యాటరీ ప్యాక్‌లు.. 510 కి.మీ వరకు రేంజ్
క్రెటా ఎలక్ట్రిక్‌లో 42 కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్యాటరీతో కూడిన లాంగ్-రేంజ్ వేరియంట్‌కు ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. లాంగ్-రేంజ్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.
ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లు
క్రెటా ఎలక్ట్రిక్‌లో వెహికల్-టు-లోడ్ (V2L), హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ADAS, ఐ-పెడల్ సింగిల్ పెడల్ డ్రైవింగ్, డిజిటల్ కీ, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.
ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ
దేశంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మైహ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వినియోగదారులు గుర్తించి ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
Tags : 1