5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!
Breaking News
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
Published on Thu, 06/18/2026 - 13:43
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.
ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.
ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్‌ఆర్‌వో ఖాతాల నుంచి ఎన్‌ఆర్‌ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Tags : 1